Senior Advocate Ponnavolu Sudhakar Reddy: ప్రభుత్వ భూకేటాయింపు విధానాన్ని సవాల్ చేస్తాం
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:21 AM
విశాఖలో సత్త్వ డెవలపర్స్‌కు భూకేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ...
‘సత్త్వ’ పిల్ సవరణకు అనుమతి కోరిన పిటిషనర్
అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): విశాఖలో సత్త్వ డెవలపర్స్‌కు భూకేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. భూకేటాయింపు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీని సవాల్ చేస్తూ పిల్‌ను సవరించేందుకు అనుమతించాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం అందుకు అంగీకరించి.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. విశాఖపట్నం పరిధిలోని మధురవాడ ఐటీ హిల్ నంబర్ 4 వద్ద 30 ఎకరాలను సత్త్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయిస్తూ.. రాష్ట్ర ఐటీ-ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ల శాఖ ఈ ఏడాది ఆగస్టు 1న జారీ చేసిన జీవో 27ని సవాల్ చేస్తూ విశాఖకు చెందిన మేడపాటి వెంకటరెడ్డి పిల్ దాఖలు చేశారు.వివిధ సంస్థలకు చేసే భూకేటాయింపుకు టెండర్/ఆక్షన్ విధానాన్ని అనుసరించేలా ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలని.. 2023లో ఏపీఐఐసీ తీసుకొచ్చిన నిబంధనలను అనుసరించి లీజు విధానంలో ఏపీఐఐసీ, ఎస్‌ఐపీబీ ద్వారా భూకేటాయింపులు జరిపేలా ఆదేశాలివ్వాలని కోరారు. సంబంధిత జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ)ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ... వివిధ కంపెనీలు/సంస్థలకు భూకేటాయింపులను సవాల్ చేస్తూ ఇప్పటికే ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ... భూకేటాయింపుల కారణంగా పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి కదా అని ప్రశ్నించింది. పొన్నవోలు బదులిస్తూ.. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, భూకేటాయింపులు జరుగుతున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూకేటాయింపు పాలసీని సవాల్ చేస్తామని.. పిటిషన్‌లో సవరణకు అనుమతించాలని కోరారు.