Government: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:10 AM
ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇందుకు సీఎం కు, ప్రభుత్వానికి గురువారం ధన్యవాదాలు తెలిపారు. నాడు ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించాలని అడిగితేనే అరెస్టు చేసి, చంపేయమన్న రోజులు చూశామని, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ వాణిజ్య పన్నుల సర్వీసుల సంఘం గుర్తింపును రద్దు చేస్తామంటూ నోటీసులు ఇచ్చారన్నారు. గవర్నర్‌ను కలవడమే నాటి ప్రభుత్వానికి నేరంగా కనిపించిందని, అయితే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ అరాచక నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుని రాజ్యాంగ హక్కులను కాపాడిందన్నారు.
గౌడ కుల ధ్రువీకరణకు సవరణలు
బీసీల్లో గ్రూప్ బి-సీరియల్ నంబర్ 4లోని ఏ కులానికి సంబంధించి ఆ కులం పేరుతో కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈడిగ, గౌడ(గమ్మళ్ల), కలాలీ, గౌండ్ల, శెట్టిబలిజ, శ్రీశయన(సెడిగి)కులాకు గౌడ అనే పేరు ముందు చేర్చి రెవెన్యూ శాఖ కుల ధ్రువీకరణ పత్రం ఇస్తోంది. ఇకపై గ్రూపు నంబర్ 4లోని కులాల పేరుతో ప్రత్యేకంగా కులధ్రువీకరణ పత్రాలు అందించాలని, గౌడను ముందు చేర్చకుండా సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేయాలని సీసీఎల్‌ఏకు సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.