Share News

Health Minister Satya Kumar: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే..324 రకాల వైద్య సేవలు

ABN , Publish Date - Sep 16 , 2025 | 03:54 AM

ఇన్సూరెన్స్‌ విధానంలో 324 రకాల వైద్య సేవలను ప్రభుత్వాసుపత్రుల ద్వారానే అందించాలని నిర్ణయించినట్లు ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ పేర్కొన్నారు..

Health Minister Satya Kumar: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే..324 రకాల వైద్య సేవలు

  • బీమా ద్వారా మరో 2,550 రకాలు: సత్యకుమార్‌

అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఇన్సూరెన్స్‌ విధానంలో 324 రకాల వైద్య సేవలను ప్రభుత్వాసుపత్రుల ద్వారానే అందించాలని నిర్ణయించినట్లు ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం 169 రకాల సేవలు అందుతున్నాయని, మరో 155 సేవలను అందించనున్నట్లు వివరించారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద లబ్ధిదారులకు ఉచితంగా అందుతున్న వైద్య సేవలు, కొత్త హైబ్రీడ్‌ విధానంలో అమలు చేయనున్న సేవలను క్రమబద్ధీకరించడంపై అధ్యయనం చేసినట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం చికిత్సలో సారూప్యత, ఒకేరకం ప్యాకేజీ, విలువ కలిగిన పలు వైద్యసేవలను వేర్వేరుగా చూపి సేవల సంఖ్య 3,257కు పెరిగినట్లు ప్రచారం చేసుకుందన్నారు. అలాంటి ఒకే రకమైన 186 సేవలను ఒకే ప్యాకేజీ కిందకు తీసుకువచ్చామని తెలిపారు. ప్రభుత్వాసుపత్రులకు కేటాయించిన 324 సేవలు, అరుదుగా అందిస్తున్న మరో 197 రకాల సేవలు, ఒకే ప్యాకేజీ కిందకు తీసుకువచ్చిన 186 సేవలు మినహా.. మిగిలిన 2,550 సేవలను ఇన్సూరెన్స్‌ కింద అందించనున్నట్లు వెల్లడించారు. అధిక సంఖ్యలో జరిగే గర్భాశయ, ఎపెండిక్స్‌ తొలగింపు, ఈఎన్‌టీ సేవలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందిస్తామని వివరించారు. తొలిసారి పేదరిక రేఖకు ఎగువన(ఏపీఎల్‌) ఉన్న కుటుంబాలకు కూడా ఆరోగ్యబీమా లభిస్తుందన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 03:54 AM