Share News

AP Govt: డీసీసీబీల్లో మొండి బకాయిల వసూళ్లపై దృష్టి

ABN , Publish Date - Sep 25 , 2025 | 05:05 AM

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో 13 డీసీసీబీల పరిధిలో సొసైటీల ద్వారా తీసుకున్న రుణాల్లో మొండి బకాయిలు...

AP Govt: డీసీసీబీల్లో మొండి బకాయిల వసూళ్లపై దృష్టి

  • 13 బ్యాంకుల్లో 1800 కోట్ల వరకూ బకాయిలు

  • వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు అవకాశమిచ్చే యోచన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో 13 డీసీసీబీల పరిధిలో సొసైటీల ద్వారా తీసుకున్న రుణాల్లో మొండి బకాయిలు సుమారు రూ.1,600 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఎక్కువగా గోదావరి జిల్లాల్లో 6 నుంచి 7 వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద వసూలు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించడానికి తొమ్మిది మందితో ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు నేతృత్వం (చైర్మన్‌)లో తూర్పు గోదావరి, గుంటూరు, అనంతపురం డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జులు టి.రామస్వామి, ఎం.మల్లికార్జునరావు, ఎం.కేశవరెడ్డితోపాటు ఆప్కాబ్‌ ఎండీ, సీజీఎం (డెవలప్‌మెంట్‌), సీజీఎం (ఆపరేషన్స్‌), జనరల్‌ మేనేజర్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆప్కాబ్‌ డీజీఎం (డీవోఎస్‌) మెంబర్‌ కన్వీనర్‌గా నియామకమైన ఈ కమిటీ త్వరలో సమావేశం కానుంది. రాష్ట్రంలోని అన్ని డీసీసీబీలను సందర్శించి ఆయా జిల్లాల్లో మొండి బకాయిల వివరాలు సేకరించనుంది. సొసైటీల నుంచి తీసుకున్న రుణం మొత్తం ఒకేసారి చెల్లించేలా ఒక ప్రతిపాదన చేయనున్నది అని తెలుస్తోంది. అసలు చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తారా? లేక తీసుకున్న రుణం, కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలా? అనేది దానిపై కమిటీ చర్చించనుంది. మొండి బకాయిలు వసూలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిటీ త్వరలోనే సమావేశమై విధి విధానాలు ఖరారు చేస్తుందని ఓటీఎస్‌ కమిటీ చైర్మన్‌, విశాఖ డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు.

Updated Date - Sep 25 , 2025 | 05:06 AM