Minister Payyavula Keshav: ప్రాధాన్య ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:54 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు వివిధ శాఖలతో సమీక్షలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాలను పట్టాలెక్కించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
నిధులు సమకూర్చడం కోసం ఆర్థిక శాఖ కసరత్తు: పయ్యావుల
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు వివిధ శాఖలతో సమీక్షలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాలను పట్టాలెక్కించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలవరం, రాయలసీమ, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు, రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేయడం కోసం, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు, జల్‌జీవన్ మిషన్ లాంటి ప్రాధాన్య ప్రాజెక్టుల కార్యాచరణ ప్రణాళిక, వాటికి అవసరమయ్యే నిధుల గురించి ఆర్థికశాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోందని ఆ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. మంగళవారం ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి వివిధ సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాల విషయంలో నిధులు సమకూర్చడంపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. త్రైమాసికాల వారీగా ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చవుతుందో సమీక్షించామన్నారు. యుద్ధప్రాతిపదికన హంద్రీనీవాను 100రోజుల్లో పూర్తిచేసినట్లు మిగతా ప్రాజెక్టులకు కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జల్‌జీవన్‌మిషన్ ప్రాజెక్టుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల బిల్లులు ఆగిపోయాయన్నారు. ఆ బిల్లుల చెల్లింపునకు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, పీపీపీ ప్రాజెక్టులపై ప్రచారం కల్పించడం, ఆ రంగంలోని కొత్త విధానాలను తెలుసుకోవడం కోసం ఈనెల 14, 15 తేదీల్లో ఆర్థిక శాఖ విశాఖలో రీఇమాజినింగ్ ఫైనాన్స్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది.