Share News

Govt Employees Association: ఆందోళన కలిగిస్తున్న బదిలీల ప్రక్రియ

ABN , Publish Date - Jul 28 , 2025 | 05:18 AM

రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

Govt Employees Association: ఆందోళన కలిగిస్తున్న బదిలీల ప్రక్రియ

  • ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

విజయవాడ (గాంధీనగర్‌), జూలై 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రామమోహన్‌ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయ నేతలు తమ స్వీయ అస్థిత్వం కోసం ఉద్యోగుల బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. బదిలీల కోసం అధికారుల వద్దకు వెళ్తున్న ఉద్యోగులను ఎమ్మెల్యేల లెటర్లు ఉన్నాయా అని అడిగే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన వేదిక లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని సవరించి, పార్లమెంట్‌లో చట్టంచేసి ఏర్పాటుచేసిన అడ్మిస్ర్టేటివ్‌ ట్రైబ్యునల్‌ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతుండగా, గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఉద్యోగులకు రూ.25 వేల కోట్లకు పైగా ఉన్న వివిధ రకాల ఆర్థిక బకాయిల చెల్లింపునకు ఒక ప్రణాళిక ప్రకటించాలని తీర్మానించారు. ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లోని జీపీఎఫ్‌ బకాయిలు, గత ప్రభుత్వంలో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో నుంచి అక్రమంగా తీసుకున్న రూ.500 కోట్లపై విచారణ నివేదికను బహిర్గతం చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. లోపభూయిష్టంగా ఉన్న విధానాన్ని రద్దుచేసి పారదర్శకమైన ఏకరీతి నిర్దిష్టమైన బదిలీ విధానాన్ని రూపొందించాలని తీర్మానించారు. ప్రధాన ఉద్యోగ సంఘానికి ప్రతి ఉద్యోగీ నేరుగా ఓటు వేసి ఎన్నుకునేలా ప్రభుత్వమే ఒక ఎన్నిక విధానాన్ని చట్ట నిబంధనల ప్రకారం తీసుకురావాలని తీర్మానించారు. ఈ సమావేశంలో జేఏసీ కో-చైర్మన్‌ కె.హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 05:20 AM