Minister Lokesh Emphasized: ఆటో డ్రైవర్ల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:29 AM
ఆటోవాలాల సంక్షేమం, వారి పిల్లల భవిష్యత్తు బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి లోకేశ్ చెప్పారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు.....
డ్రైవర్ల సమస్యలన్నీ పరిష్కరించాం
ఆటోలపై కొటేషన్లు చదివి డ్రైవర్లను ఉత్తేజ పరిచిన లోకేశ్
విజయవాడ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఆటోవాలాల సంక్షేమం, వారి పిల్లల భవిష్యత్తు బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి లోకేశ్ చెప్పారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా నవ్వుతూ ప్రయాణికులను పలుకరిస్తారని ఆటో డ్రైవర్లను కొనియాడారు. సామాన్యుడి కారు ఆటో అని అభివర్ణించారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రూ.10 వేలు ఆర్థిక సహాయంగా ఇచ్చినట్టే ఇచ్చి.. మరోరకంగా వెనక్కి లాక్కునేవారని చెప్పారు. యువగళం పాదయాత్ర సందర్భంగా డ్రైవర్లు నాటి సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే.. వారి నుంచి వివరాలు తెలుసుకున్నానని అన్నారు. వివిధ రకాల జరిమానాలతో పాటు, గుంతల రోడ్ల వల్ల మరమ్మతులకు చాలా డబ్బులు ఖర్చయ్యేవని చెప్పారు. ఆటోడ్రైవర్ల సమస్యలన్నింటినీ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కరించామన్నారు. గ్రీన్ ట్యాక్స్‌ను రూ. 3 వేలకు తగ్గించేలా చేశామని, రోడ్లపై గుంతలు పూడ్పించడంతో పాటు కొత్త రోడ్లు వేయిస్తున్నాం. ఇక గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాల వరకు ఆటోల్లోనే చర్చ నడుస్తుందని, వైనాట్ 175 అంటే ఆటో డ్రైవర్ల మౌఖిక ప్రచారం కారణంగా 11 సీట్లకే పరిమితం అయ్యిందని గుర్తుచేశారు.
ఆలోచింపజేసేలా కొటేషన్లు
ఆటోల మీద కొటేషన్లను ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ చదివి వినిపించారు. ‘వర్షం ఎలా పడుతుంది అని మీ పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడని చెప్పొద్దు.. ఒక మొక్క నాటితే చుక్క వర్షం పడుతుందని చెప్పండి’ అన్న కొటేషన్‌తో పర్యావరణ పరిరక్షణకు ఒక ఆటో డ్రైవరన్న ప్రచారం చేస్తున్నాడన్నారు. మరో ఆటో డ్రైవరన్న ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అంటూ మంచితనాన్ని చాటుకున్నారని చెప్పారు. అలాగే మరో కొటేషన్ ‘ జరభద్రం భయ్యా.. మనం జాగ్రత్త’తో ఆటో డ్రైవర్లు రోడ్డుభద్రత గురించి ప్రచారం చేస్తున్నారని మెచ్చుకున్నారు. ‘అప్పుచేసి కొన్నాను.. నన్ను చూసి ఏడవకండి’ అన్న కొటేషన్ల గురించి ప్రస్తావిస్తూ ఆటో డ్రైవర్లతో సరదాను పంచుకున్నారు.
మహిళలకు గౌరవం దక్కాలి
అతివలు అంతరిక్షంలోకి వెళ్తున్నారని, ఆటోలు నడుపుతున్నారని అలాంటి ఆడవారిని అవమానించే మాటలు మాట్లాడకూడదని లోకేశ్ అన్నారు. మహిళలకు తగిన గౌరవం దక్కాలన్నారు. గతంతో కొందరు నేతలు బయటకు రావాలంటే పరదాలు, బారికేడ్ల్లు పెట్టుకునేవారని ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాన్యులు వలే ఆటోల్లో ప్రయాణం చేశారన్నారు.