Share News

AP Govt: అమరావతికి మరో 20,494 ఎకరాలు

ABN , Publish Date - Jul 06 , 2025 | 02:58 AM

రాజధాని అమరావతిలో 20,494 ఎకరాలను భూసమీకరణ ప్రక్రియ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన...

AP Govt: అమరావతికి మరో 20,494 ఎకరాలు

  • భూసమీకరణకు ప్రభుత్వం నిర్ణయం

  • 4 అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రాలు

  • హైడెన్సిటీ రెసిడెన్షియల్‌ జోన్‌కు ఆమోదం

  • ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేటు సంస్థలకు భూమి

  • రాజధాని పనులకు కృష్ణా నుంచి ఇసుక

  • అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు

  • చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో 7 అంశాలకు ఆమోదం

అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో 20,494 ఎకరాలను భూసమీకరణ ప్రక్రియ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ 50వ అథారిటీ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం ఏడు అంశాలకు ఆమోదం తెలిపారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడిలేమల్లే, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో భూసమీకరణ చేయాలని నిర్ణయించారు. మందడం, రాయపూడి, పిచుకులపాలెంలో ఫైనాన్స్‌, స్పోర్ట్స్‌ సిటీలోని దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్‌ జోన్‌, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్‌ఎ్‌ఫపీని ఆహ్వానించేందుకు అనుమతించారు. అలాగే అమరావతిలో నిర్మించే ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్‌డీఏ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మందడంలో వివంతా, హిల్టన్‌ హోటల్స్‌, తుళ్లూరులో హయత్‌, లింగాయపాలెం నోవాటెల్‌ సమీపంలో కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణానికి రెండున్నర ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


ఇసుక డీసిల్ట్టేషన్‌కు అనుమతి

రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు కృష్ణా నది నుంచి ఇసుకను డ్రెడ్జింగ్‌ చేసుకునేందుకు సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో అనుమతి మంజూరు చేశారు. ప్రస్తుతం రాజధానిలో రూ.49,040 కోట్ల విలువైన పనులు జరుగుతుండటంతో రానున్న రెండేళ్లలో వివిధ ప్రాజెక్టులకు 160 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరమవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిల్టింగ్‌ చేసుకునేందుకు అనుమతివ్వాలని జలవనరుల శాఖను కోరింది. రెండేళ్ల పాటు రాజధాని ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను తవ్వుకునేందుకు సమావేశంలో అనుమతించారు. ఇసుక డీసిల్టేషన్‌ ప్రక్రియకు రూ.286 కోట్ల మేర వ్యయం కానున్నట్లు అధికారులు తెలిపారు.


వివిధ సంస్థలకు భూకేటాయింపులు

అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులపై మంత్రుల సబ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. సీబీఐకు 2 ఎకరాలు, జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు 2 ఎకరాలు, స్టేట్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు 0.495 ఎకరాలు, పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీకి 12 ఎకరాలు, ఎంఎస్‌కే ప్రసాద్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి 12 ఎకరాలు కేటాయించేందుకు అంగీకరించారు. అలాగే ఆదాయ పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 0.40 ఎకరాలు, ఎస్‌ఐబీకి 0.50 ఎకరాలు, కిమ్స్‌ ఆసుపత్రి, మెడికల్‌ కళాశాలలకు 25 ఎకరాలు, బీజేపీ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాలు, బాసిల్‌ ఉడ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు 4 ఎకరాలు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, అంబికా గ్రూప్‌లకు గతంలో కేటాయించిన 1.40 ఎకరాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి సమీపంలో ఈ-15 రహదారిపై నాలుగు లేన్ల ఆర్‌ఓబీ నిర్మాణానికి ఆమోదం తెలిపారు.


అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు

రాజధాని అమరావతిలో స్ఫూర్తి ప్రదాతల స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. వివిధ ప్రాంతాల్లో నిర్మించే ఎకో పార్కులకు మంచి పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టుల కోసం అధికారులు ఎలాంటి భేషజాలు లేకుండా ప్రయత్నాలు చేయాలని సూచించారు. అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ అని, గతంలో రాష్ట్ర సచివాలయాన్ని రికార్డు సమయంలో నిర్మించామని, అదే స్ఫూర్తితో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతిలో ఎయిర్‌పోర్టు నిర్మాణం విషయంలో కేంద్రంతో సంప్రదింపులు చేయాలని అధికారులకు సూచించారు. రాజధానిలో నిర్మించతలపెట్టిన ఏ ప్రాజెక్టూ ఆలస్యం కాకుండా చూడాలన్నారు. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణ పనులు సరిగా చేయని సంస్థలకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని, గడువులోగా పూర్తి చేసేలా నిర్దేశించాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌, సీఆర్‌డీఏ ఏడీసీ, ఆర్థిక శాఖ, సీసీఎల్‌ఏకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.


రాజధానికి భూములివ్వం

పొన్నెకల్లు గ్రామసభలో ఆందోళన

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ రైతులు తేల్చి చెప్పారు. శనివారం తాడికొండ మండలం గరికపాడు, పొన్నెకల్లు, నిడుముక్కల గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ రెండో దశకు సంబంధించి గ్రామ సభలను నిర్వహించారు. పొన్నెకల్లు గ్రామసభను రద్దు చేయాలని రైతులు ఆందోళనలు చేపట్టారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఆర్‌డీవో శ్రీనివాస్‌, ఇతర అధికారులు స్టేజ్‌పైకి రాగానే రైతులు ఒక్కసారిగా అక్కడికి వచ్చి గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. రైతులు శాంతించకపోవడంతో తాత్కాలికంగా గ్రామసభను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

క్యాన్సర్‌ బాధిత కార్యకర్తకు సీఎం వీడియో కాల్‌

చంద్రబాబును చూడాలన్న కోరిక మేరకు ఫోన్‌

క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త కోరికను సీఎం చంద్రబాబు తీర్చారు. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కృష్ణ తొలి నుంచీ టీడీపీ అభిమాని. చంద్రబాబు అంటే అమిత ఇష్టం. తన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని కృష్ణ కోరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు శనివారం స్వయంగా కృష్ణకు వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాల ఆదుకుంటామని కృష్ణ కుటుంబానికి భరోసా ఇచ్చారు. చంద్రబాబు ఫోన్‌ చేయడంపై కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 06 , 2025 | 03:00 AM