Share News

Medical Services: పీహెచ్‌సీ వైద్యులకు 20శాతం ఇన్‌సర్వీస్‌ కోటా

ABN , Publish Date - Oct 06 , 2025 | 03:25 AM

పీహెచ్‌సీ వైద్యుల డిమాండ్‌ మేరకు పీజీ ఇన్‌-సర్వీస్‌ కోటాలో 20 శాతం సీట్లను కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు....

Medical Services: పీహెచ్‌సీ వైద్యులకు 20శాతం  ఇన్‌సర్వీస్‌ కోటా

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పీహెచ్‌సీ వైద్యుల డిమాండ్‌ మేరకు పీజీ ఇన్‌-సర్వీస్‌ కోటాలో 20 శాతం సీట్లను కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు. డీహెచ్‌ కార్యాలయంలో ఆందోళనలో ఉన్న పీహెచ్‌సీ వైద్యుల సంఘం నేతలతో ఆదివారం ఆయన చర్చించారు. వైద్యుల టైం బౌండ్‌ పదోన్నతులు, ట్రైబల్‌ అలవెన్స్‌, ఇతర సర్వీస్‌ వ్యవహారాల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. ఇన్‌ సర్వీస్‌ కోటా సీట్లను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచుతామని, ఇందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని వెల్లడించారు. వెంటనే వైద్యులంతా విధుల్లో చేరాలని కోరారు. అయితే, 20 శాతం రిజర్వేషన్‌ను 2030 వరకూ కొనసాగించాలన్న తమ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించనందున ఆందోళనలు యథావిధిగా కొనసాగిస్తామని వైద్యులు ప్రకటించి అక్కడ నుంచి నిష్క్రమించారు. వైద్యుల తీరు పట్ల కమిషనర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే 20 శాతం సీట్ల కేటాయింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తదుపరి సంవత్సరాల్లో ఈ కోటాను ఎలా అమలుచేయాలన్న దానిపై సమగ్రంగా అధ్యయనం చేసి, విధానపరమైన నిర్ణయాన్ని వచ్చే నెలలోగా తీసుకుంటుందని తెలిపారు. ఇన్‌ సర్వీస్‌ కోటా అమలుతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు సేవలు చేయాలనుకునే డైరెక్ట్‌ పీజీ వైద్యులకు అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. వైద్యుల నియామక నోటిఫికేషన్లో ఎక్కడా కూడా ఇన్‌ సర్వీస్‌ కోటా పీజీ సీట్ల గురించి పేర్కొనలేదని చెప్పారు. టైం బౌండ్‌ పదోన్నతులు, ట్రైబల్‌ అలవెన్స్‌, నోషనల్‌ ఇంక్రిమెంట్ల గురించి చర్చించి, ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా కమిటీ వేశామన్నారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల కోసమే: వైద్యులు

తాము కూడా పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకే సర్వీ్‌సలోకి వచ్చామని వైద్యులు తెలిపారు. పీహెచ్‌సీల్లో విధులు నిర్వహించే వైద్యులకు స్పెషాలిటీ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు. తాము పీజీ పూర్తి అయిన వెంటనే బోధనాస్పత్రుల్లో, సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో పోస్టింగ్స్‌ ఇవ్వాలని కోరడం లేదని, ఇన్‌ సర్వీస్‌ కోటా పెంచడం వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందుతాయని చెప్పారు.

Updated Date - Oct 06 , 2025 | 03:25 AM