AP Government: ఇవ్వండి.. ప్లీజ్
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:00 AM
రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు 32 వేల పైచిలుకు ఎకరాల భూములను భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్) కింద ఇచ్చారు. అయితే.. ఆయా భూముల మధ్యలో ఉన్న కొన్ని భూములను...
అమరావతి రైతులకు ప్రభుత్వం మరోసారి విన్నపం
రాజధాని నిర్మాణాల మధ్య ఉన్న 1800 ఎకరాలు ఇవ్వాలని వినతి
ల్యాండ్ పూలింగ్‌లో ఇస్తేనే లాభం..కాదంటే.. భూసేకరణ: నారాయణ
పెనుమాక, రాయపూడి, మల్కాపురంలో భూసేకరణకు సీఆర్డీఏ అడుగులు
గుంటూరు/తుళ్లూరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు 32 వేల పైచిలుకు ఎకరాల భూములను భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్) కింద ఇచ్చారు. అయితే.. ఆయా భూముల మధ్యలో ఉన్న కొన్ని భూములను సంబంధిత రైతులు ఇప్పటికీ ఇవ్వలేదు. ఇలా.. 1800 ఎకరాల భూములు అమరావతి నిర్మాణాల మధ్యలో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా భూములను కూడా రైతుల నుంచి తీసుకోవాలని సీఆర్‌డీఏ అథారిటీ నిర్ణయించింది. ఇప్పటికే సంబంధిత రైతులను ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించాలని పలు దఫాలుగా కోరారు. అయినప్పటికీ వారు స్పందించడం లేదు. ఈక్రమంలో తాజాగా మరోసారి వారితో చర్చించి.. ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకోవాలని, లేకపోతే.. భూ సేకరణ(ల్యాండ్ అక్విజిషన్) కింద అయినా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన 52వ సీఆర్డీఏ అఽథారిటీ సమావేశం నిర్ణయించింది. రాజధాని మాస్టర్‌ప్లాన్ పరిధిలోని నిడమర్రు, పెనుమాక, రాయపూడి, మల్కాపురం గ్రామాలలో కీలక నిర్మాణాల మధ్య ఉన్న భూములను రైతులు ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలకు ఇబ్బందిగా మారింది. వాస్తవానికి భూసమీకరణ పద్ధతిని రాజధాని రైతులు దాదాపు అందరూ అంగీకరించారు. అయితే, వైసీపీ ప్రభావం అధికంగా ఉన్న గ్రామాల్లో కొందరు నిరాకరించారు. అప్పట్లో నిడమర్రు, పెనుమాక తదితర గ్రామాల్లో భూసమీకరణను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అవి సాధ్యపడకపోవడంతో తమ అనుకూలురైన రైతులను భూములు ఇవ్వకుండా నేతలు నిలువరింపజేశారు.
ఇలా నాలుగు గ్రామాలకు సంబంఽధించి 80 మంది రైతులు భూములు ఇవ్వలేదని తెలుస్తోంది. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని అతి కొద్ది మంది రైతులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని రైతులకు భూసేకరణ కంటే సమీకరణ ద్వారానే ఎక్కువ లాభం చేకూరుతుందన్నారు. మిగిలిన 1800 ఎకరాలను భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. భూసేకరణ అధికారాన్ని సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగించినట్లు వివరించారు. కాగా, రాజధాని అమరావతిలో ఈ నెలాఖరులోగా సీఆర్‌డీఏ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మంగళవారం రాయపూడి పరిధిలో నిర్మాణంలో ఉన్న సీఆర్‌డీఏ జోనల్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు.