Share News

AP Govt: ఓర్వకల్లులో ఆర్గానిక్‌ కెమికల్‌ ప్లాంట్‌

ABN , Publish Date - Dec 14 , 2025 | 05:27 AM

రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలపై ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది.

AP Govt: ఓర్వకల్లులో ఆర్గానిక్‌ కెమికల్‌ ప్లాంట్‌

  • విరూపాక్ష సంస్థకు 100 ఎకరాలు

  • రాష్ట్రంలో మరిన్ని కంపెనీలకు భూమి కేటాయింపు

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలపై ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. ఇటీవల క్యాబినెట్‌, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ)లో ఆమోదం పొందిన కంపెనీలకు భూములు కేటాయించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఐపి గుట్టపాడు క్లస్టర్‌లో ఫార్మాస్యూటికల్‌ అండ్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌ ప్లాంట్‌ (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌ తయారీ యూనిట్‌) ఏర్పాటు కోసం విరూపాక్ష ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఎకరా రూ. 30 లక్షల చొప్పున మొత్తం 100.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే అక్కడే ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్లు, ఎనర్జీ స్టోరేజ్‌ పరికరాల తయారీ యూనిట్‌ కోసం గతంలో ప్యూర్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు 105.12 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేసి.. ఆ భూములను విరూపాక్ష కంపెనీకి ఇచ్చేందుకు ఏపీఐఐసీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు గ్రామంలో రూ. 870 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్‌ లార్జ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ అభివృద్ధి కోసం ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ లిమిటెడ్‌కు 2,776.23 ఎకరాల భూములను కేటాయించింది. ఈ పార్కులో 70 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


రాముకా, ఎలీప్‌లకు భూములు

ఇక రాముకా గ్లోబల్‌ ఎకోవర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అభ్యర్థన మేరకు అనకాపల్లి జిల్లా, కోడూరు మొదటి దశ ప్రాజెక్టు కోసం 45 ఎకరాల భూమిని రాయితీ రేటుకు ప్రభుత్వం కేటాయించింది. దాంతో పాటు ఆ భూమి ధర చెల్లింపు కోసం 6 నెలల పాటు గడువు పొడిగింపు (ఈవోటీ)నకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. గతంలో అచ్యుతాపురంలోని డీ-నోటిఫైడ్‌ ఏరియాలో ఎకరం రూ. 87.82 లక్షల చొప్పున 45 ఎకరాలు రాముకాకు కేటాయించారు. ఆ భూములు లోతట్టు ప్రాంతంలో ఉండటం, కనెక్టివిటీ లేకపోవడంతో రాముకా సంస్థ సకాలంలో ధర చెల్లించక గడువు ముగిసిపోయింది. ఆ సంస్థ తాజా అభ్యర్థన మేరకు ఆ భూమిని ఎకరా 35 లక్షల చొప్పున కేటాయించింది. భూమిని చదును చేయడం, అదనపు మౌలిక సదుపాయాల ఖర్చులను రాముకా సంస్థ భరించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇక అనకాపల్లి జిల్లాలోని కోడూరులోనే ప్రైవేట్‌ ఎంఎ్‌సఎంఈ ఇండస్ట్రియల్‌ పార్క్‌ను ఏర్పాటు కోసం అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎలీప్‌) సంస్థకు 31.77 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

Updated Date - Dec 14 , 2025 | 05:28 AM