Health Insurance: ఆరోగ్య బీమాలో మరో అడుగు
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:02 AM
అందరికీ ఆరోగ్య బీమా అమలు ప్రక్రియలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు ఇప్పటికే..
ఆర్‌ఎ్‌ఫపీ, డీసీఏలకు ఆమోదం.. టెండర్లకు సర్కారు గ్రీన్‌సిగ్నల్
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): అందరికీ ఆరోగ్య బీమా అమలు ప్రక్రియలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదించగా, ఇప్పుడు టెండర్ విధానం ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీని ఎంపిక చేసేందుకు డ్రాఫ్ట్ ఆర్‌ఎ్‌ఫపీ(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్-ఆరోగ్య బీమా కోసం ప్రతిపాదన అభ్యర్థన), డీసీఏ(డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్)లకు ఆమోదం తెలిపింది. టెండర్లు పిలిచేందుకు ఏపీఎంఎంఎ్‌సఐడీసీకి అనుమతులిచ్చింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఏంజేఏవై-డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పథకం కింద హైబ్రిడ్ విధానంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న వారిని బీపీఎల్ కింద పరిగణిస్తారు. వీరికి రూ.2.50 లక్షల వరకూ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వైద్యం అందిస్తారు. వైద్యం ఖర్చు రూ.2.50 లక్షలు దాటి రూ.25 లక్షల వరకూ అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోకి తీసుకువచ్చి వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దారిద్య్రరేఖకు పైన ఉన్న (ఏపీఎల్) కుటుంబాలకు మాత్రం రూ.2.50 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందే వెసులుబాటు కల్పించనుంది.