Share News

Aqua industry India: సుంకాల భారాన్ని అధిగమిద్దాం

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:16 AM

అమెరికా సుంకాల పెంపుతో ఆక్వా పరిశ్రమపై వచ్చిన ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల దేశీయ వినియోగాన్ని పెంచేందుకు ఎన్‌సీపీసీ పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Aqua industry India: సుంకాల భారాన్ని అధిగమిద్దాం

దేశీయంగా వినియోగం పెంచుదాం

ఆక్వా రైతు, సీడ్‌, ఫీడ్‌ తయారీదారుల

సదస్సులో మంత్రి అచ్చెన్న

సముచిత ధర ఇచ్చేందుకు

ఎగుమతిదారుల సమ్మతి!

విజయవాడ లబ్బీపేట, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): అమెరికా సుంకాల పెంపుతో ఆక్వా పరిశ్రమపై పడిన ఆర్థిక ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. విజయవాడలో సోమవారం మత్య్సశాఖ అధికారులు, ఆక్వా రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ఆక్వా రైతులతో మంత్రి అచ్చెన్నాయుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, ఎమ్యెల్యే గద్దె రామ్మోహన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ఇది రెండు దేశాలు కలిసి తీసుకోవలసిన నిర్ణయం కావడంతో పరిష్కారానికి కొంత సమయం పడుతుందన్నారు. రొయ్యల ఎగుమతిపై ఆధారపడకుండా దేశంలోనే వినియోగించుకోవడం ముఖ్యమని చెప్పారు. క్రాప్‌ హాలిడేపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనని, దానికి అవకాశం లేదన్నారు. పట్టుబడికి వచ్చిన రొయ్యలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ సుంకాల భారంపై ఆందోళన వద్దని చెప్పారు. దేశీయ మార్కెట్లలో ఏవిధంగా అభివృద్ధి చెందాల నే అంశంపై చర్చించి, సూచనలు చేసేందుకు నేషనల్‌ ప్రాన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ(ఎన్‌సీపీపీ) అనే సంస్థను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ సంస్ధ ద్వారా రొయ్యల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. మన రొయ్యను మనమే ప్రమోట్‌ చేసుకుంటే ఆర్థికంగా ఈ రంగం ఎదుగుతుందన్నారు. ఆక్వా రంగాన్ని దేశీయంగా అభివృద్ధి చేసుకోడంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ చెప్పారు. ముఖ్యంగా ఆర్మీ మెనూలో రొయ్యను చేరిస్తే వినియోగం పెరుగుతుందన్నారు. దీనిని కేంద్ర రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

Updated Date - Apr 08 , 2025 | 04:16 AM