Share News

Google Versus Adani Data Center: ఎవరి క్రెడిట్‌.. ఎవరి చోరీ

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:09 AM

విశాఖలో గిగావాట్‌ సామర్థ్యంతో ‘ఏఐ డేటా సెంటర్‌’ ఏర్పాటు చేస్తున్నదెవరు? గూగుల్‌ సంస్థా? అదానీయా? ఈ ప్రశ్నకు ప్రపంచమంతా చెప్పే సమాధానం... ‘గూగుల్‌’ అనే! చివరికి...

Google Versus Adani Data Center: ఎవరి క్రెడిట్‌.. ఎవరి చోరీ

గూగుల్‌ డేటా సెంటర్‌పై జగన్‌ సిత్రాలు

అది ‘అదానీ’దే అంటూ వింత వాదనలు

2020 నవంబరులోనే ఒప్పందమట!

అంతకు ఏడాదిన్నర ముందే శంకుస్థాపన చేసిన చంద్రబాబు

(విశాఖపట్నం/అమరావతి-ఆంధ్రజ్యోతి)

విశాఖలో గిగావాట్‌ సామర్థ్యంతో ‘ఏఐ డేటా సెంటర్‌’ ఏర్పాటు చేస్తున్నదెవరు? గూగుల్‌ సంస్థా? అదానీయా? ఈ ప్రశ్నకు ప్రపంచమంతా చెప్పే సమాధానం... ‘గూగుల్‌’ అనే! చివరికి... అదానీని అడిగినా ‘అది గూగుల్‌ డేటా సెంటర్‌’ అనే చెబుతారు. జగన్‌ మాత్రం ‘అది అదానీదే’ అంటూ వింతలకు పోతున్నారు. భాగస్వాముల మధ్య ఒప్పందాలు, సాంకేతిక అంశాల మేరకు విడుదలైన ఉత్తర్వులను చూపిస్తూ, అసలు వాస్తవాలను దాచేస్తూ అదానీనే ఆశ్చర్యపరిచే స్థాయిలో జగన్‌ రోత పత్రిక గురువారం కథనాన్ని ప్రచురించింది. డేటా సెంటర్‌ క్రెడిట్‌ అదానీకి ఇవ్వలేదనే బాధ ఒకవైపు.. తనకు క్రెడిట్‌ వస్తుందనే ఏకైక కారణంతో చంద్రబాబు ‘అదానీ’ పేరు తొక్కేస్తున్నారని మరో వైపు! ఆ డేటా సెంటర్‌ తమదే అయినప్పుడు ‘అదానీ’ ఎందుకు మౌనంగా ఉంటారు? గూగుల్‌కు క్రెడిట్‌ ఎందుకు ఇస్తారు? జగన్‌ పత్రికలో దీనికి జవాబు దొరకదు.


ఇదీ అసలు విషయం...

అమెరికా వెలుపల తొలిసారి భారత్‌లో, అదీ విశాఖలో అత్యంత భారీ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం... అని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్వయంగా ప్రకటించగా... ఆ సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర మంత్రుల సమక్షంలోనే అక్టోబరు 14వ తేదీన కుదుర్చుకున్న ఈ ఒప్పందం గురించి అందరికీ తెలుసు! ఇది గూగుల్‌ అనుంబంధ సంస్థ ‘రైడెన్‌’ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్‌. అతి భారీ ప్రాజెక్టులను అమలు చేసేటప్పుడు... స్థానిక, ఇతర భాగస్వాములను చేర్చుకోవడం సహజం. అలాగే గూగుల్‌ సంస్థ... భారతీ ఎయిర్‌టెల్‌, నెక్స్‌ట్రా డేటా, అదానీ ఇన్‌ఫ్రా, అదానీ కనెక్స్‌, అదానీ పవర్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అండర్‌ సీ కేబుల్‌ ఏర్పాటు, నిర్మాణ పనులు, విద్యుత్‌ సరఫరా వంటి పనులు చేస్తాయి. భారత్‌లో తమ తరఫున డేటా సెంటర్‌ నిర్మాణ పనులు చేస్తున్నందున భూమిని అదానీ పేరుతో కేటాయించాలని గూగుల్‌ స్వయంగా కోరింది. దీంతో... ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానిని పట్టుకుని... ‘ఇదిగో... ఇది అదానీదే’ అని జగన్‌ పత్రిక వింత వాదనలు చేసింది.


‘అదానీ’ని తెచ్చిందెవరు?

‘ఇది అదానీ డేటా సెంటర్‌. దానికి బీజాలు వేసింది నేనే. ఆ క్రెడిట్‌ను చంద్రబాబు కొట్టేస్తున్నారు’ అని జగన్‌ పదేపదే చెబుతున్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడే అదానీని ఒప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చానని.. విశాఖలో 2023 మే 3న స్వయంగా డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశానని చెప్పుకొచ్చారు. కాసేపు... గూగుల్‌ను పక్కనపెట్టేసి, ‘అదానీ’ సంగతి మాత్రమే చూద్దాం! 2023లో జగన్‌ శంకుస్థాపన చేయడానికి నాలుగేళ్ల ముందే.. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో డేటాసెంటర్‌పై ఒప్పందం కుదిరింది. అప్పుడు లోకేశ్‌ ఐటీ మంత్రిగా, ప్రస్తుత సీఎస్‌ విజయానంద్‌ ఐటీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వారి సమక్షంలోనే అదానీ గ్రూపుతో 2019 జనవరి 9న అమరావతిలోని ‘ప్రజావేదిక’ (దీనిని జగన్‌ కూల్చివేయించారు)లో ఎంవోయూ కుదిరింది. మరుసటి నెల 14న విశాఖలోని కాపులుప్పాడలో కేటాయించిన భూమిలో చంద్రబాబు అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఆనాటి ఒప్పందం ప్రకారం అదానీకి 500 ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. అందులో రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెడతామని ఆ సంస్థ ప్రకటించింది. గిగావాట్‌ సామర్థ్యంతో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌, 5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ పార్క్‌ నిర్మిస్తామని తెలిపింది. . ఇది అదానీతో జరిగిన మొదటి ఒప్పందం. అంటే... అదానీ డేటా సెంటర్‌కు తొలుత బీజం పడింది 2019లో, చంద్రబాబు హయాంలోనే.


జగన్‌ సీఎం అయ్యాక మారిన సీన్‌..

జగన్‌ 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాక అదానీ డేటా సెంటర్‌కు మోకాలడ్డారు. కాపులుప్పాడలో కేటాయించిన భూములను వెనక్కి తీసుకున్నారు. 20 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక అంటే కుదరదని, ఐదేళ్లలో ఏమి చేస్తారో చెబితే కొత్త ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించారు. దాంతో అదానీ తన పెట్టుబడిని రూ.70 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు కుదించింది. తర్వాత 14 వేల కోట్లకే పరిమితం చేసింది. ఉద్యోగ అవకాశాల సంఖ్యను 1.1 లక్షల నుంచి 25 వేలకు కుదించింది. ఏడేళ్లలో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు (200+100) రెండు ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టుకు జగన్‌ ప్రభుత్వం 190 ఎకరాలు ఇచ్చింది. సంబంధిత స్థలాల బదలాయింపులన్నీ పూర్తయ్యాక.. 2023 మే 3న విశాఖలో జగన్‌ తీరిగ్గా అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.


గూగుల్‌-అదానీకి లింకేంటి?

గూగుల్‌ డేటా సెంటర్‌కు, అదానీ డేటా సెంటర్‌కు సంబంధమే లేదని రాష్ట్రప్రభుత్వ లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి. 2023లో జగన్‌ శంకుస్థాపన చేసేనాటికే అదానీ డేటా సెంటర్‌ను వైజాగ్‌ టెక్‌ పార్కుకు అప్పగించేశారు. ఆ కథ అప్పుడే ముగిసిపోయింది. అదానీకి జగన్‌ హయాంలో కేటాయించిన స్థలాలు వేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేటాయించిన స్థలాలు వేరు. విశాఖలో డేటా సెంటర్‌ నిర్మించబోతున్న రైడెన్‌ ఇన్ఫోటెక్‌ తమ అనుబంధ సంస్థేనని పేర్కొంటూ గూగుల్‌ అధికారికంగా సమాచారం ఇచ్చింది. అయితే... అదానీ, రైడెన్‌ మధ్య ఇది వరకే వ్యాపార లావాదేవీలు జరిగాయి. నోయిడాలో అదానీ డేటా సెంటర్‌లో 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ విషయాన్ని కూడా జగన్‌ పత్రిక ప్రచురిస్తూ... ‘అదానీ, గూగుల్‌’ ఒక్కటే అన్నట్లుగా కలరింగ్‌ ఇచ్చింది. నిజానికి... భారత్‌లో గూగుల్‌ సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్న తొలి మొదటి డేటా విశాఖదే! అదానీతో తమకు భాగస్వామ్యం ఉందని ఎంవోయూ సమయంలోనే వెల్లడించింది. అండర్‌ సీ కేబుల్‌ ల్యాండింగ్‌ విషయంలో అదానీ తమకు సహకరిస్తుందని తెలిపింది.

దీనికోసం. ‘అదానీ కనెక్స్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే పునరుత్పాదక విద్యుత్‌ సరఫరా కోసం అదానీ పవర్‌తో, భవన నిర్మాణ పనులకోసం అదానీ ఇన్‌ఫ్రాతో గూగుల్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో భాగంగానే... స్థలాల కేటాయింపు విషయంలో తమ తరఫున ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అధీకృత వ్యక్తిగా అదానీకి చెందిన సంజయ్‌ వ్యవహరిస్తారని గూగుల్‌ (రైడెన్‌) లేఖ రాసింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంత మాత్రాన... అది ‘అదానీ డేటా’ సెంటర్‌ అయిపోదు. ‘గూగుల్‌తో భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని అదానీ చెప్పినప్పటికీ... చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే అదానీ పేరెత్తలేదని జగన్‌ పత్రిక విచిత్ర వాదన చేసింది.


కొసమెరుపు: ‘ఆ డేటా సెంటర్‌ జగన్‌ నాటిన మొక్క’.... 2020 నవంబరులోనే అదానీతో ఒప్పందం కుదిరిందని జగన్‌ పత్రిక పేర్కొంది. మరి... అంతకంటే ఏడాదిన్నర ముందే 2019 ఫిబ్రవరి 14న అదానీ డేటా సెంటర్‌కు చంద్రబాబు చేసిన శంకుస్థాపన సంగతేమిటి? ఇది ఎవరు నాటిన మొక్క?

Updated Date - Dec 05 , 2025 | 05:11 AM