Share News

AI Data Hub: హలో ఏపీ......ఓకే గూగుల్‌

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:09 AM

పెట్టుబడులపరంగా రాష్ట్ర చరిత్రలోనే... ఇంకా చెప్పాలంటే భారత దేశంలోనే సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత్‌లో గూగుల్‌ అతిపెద్ద పెట్టుబడికి ఏపీలోని విశాఖ కేంద్రంగా మారుతోంది.

AI Data Hub: హలో ఏపీ......ఓకే గూగుల్‌

  • ఏపీ, గూగుల్‌ మధ్య కీలక ఒప్పందం

  • విశాఖలో గూగుల్‌ అతి భారీ ఏఐ హబ్‌

  • రూ.1.36 లక్షల కోట్లకు పెరిగిన పెట్టుబడి

  • అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ ఇదే

  • రాంబిల్లి, తర్లువాడ, అడవివరంలో మూడు ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఓకే

  • సుమారు 2 లక్షల మంది ఐటీ నిపుణులకు ఇక్కడే కొలువులు

  • 12 దేశాలకు విశాఖ కేంద్రంగా గూగుల్‌ సేవలు

  • విశాఖలో ఐటీ వికాసానికి వీలుగా ‘ఎకో సిస్టమ్‌’

  • తరలి వచ్చేందుకు మరిన్ని సంస్థల ఆసక్తి

(న్యూఢిల్లీ/అమరావతి - ఆంధ్రజ్యోతి)

  • గూగుల్‌ ‘హలో ఏపీ’ అని పలకరించింది.

  • ఏపీ ‘ఓకే గూగుల్‌’ అని ప్రతిస్పందించింది.

విశాఖలో గూగుల్‌ ఏఐ హబ్‌ పెట్టుబడుల తొలి ప్రతిపాదన... రూ.87,520 కోట్లు! మంగళవారం దీని విలువ 1.36 లక్షల కోట్లకు పెరిగింది! ఏపీకి వచ్చిన అతి భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మితిమీరిన సుంకాలతో భారత్‌పై గుడ్లురుముతున్న సమయంలోనే... అదే దేశానికి చెందిన ‘గూగుల్‌’ భారత్‌లో అతి భారీ పెట్టుబడిపై ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఇది ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

పెట్టుబడులపరంగా రాష్ట్ర చరిత్రలోనే... ఇంకా చెప్పాలంటే భారత దేశంలోనే సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత్‌లో గూగుల్‌ అతిపెద్ద పెట్టుబడికి ఏపీలోని విశాఖ కేంద్రంగా మారుతోంది. అమెరికా వెలుపల అతిపెద్ద ఏఐ డేటా హబ్‌ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్టు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్‌ ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలోని తాజ్‌ మాన్‌సింగ్‌ హోటల్‌లో జరిగిన ‘భారత్‌ ఏఐ శక్తి’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్వినీ వైష్ణవ్‌, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో గూగుల్‌-ఏపీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటులో భాగంగా గూగుల్‌ 10 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెడుతుందని రాష్ట్రప్రభుత్వం భావించగా... అది 15 బిలియన్‌ డాలర్లకు చేరింది. ‘‘ఏఐ డేటా హబ్‌ ఏర్పాటు కోసం వచ్చే ఐదేళ్ల కాలంలో 15 బిలియన్‌ డాలర్ల(రూ.1,33,000 కోట్లు) పెట్టుబడులు పెడతాం’’ అని గూగుల్‌ క్లౌడ్‌ సీఈఓ థామస్‌ కురియన్‌ ప్రకటించారు. అమెరికా వెలుపల పెట్టుబడుతున్న అతి భారీ పెట్టుబడి ఇదే అని గూగుల్‌ స్పష్టం చేసింది. అమెరికా వెలుపల ఏర్పాటవుతున్న అతిపెద్ద ‘ఏఐ హబ్‌’ కూడా ఇదే కానుంది. గూగుల్‌ గిగావాట్‌ స్కేల్‌ కంప్యూటింగ్‌ సామర్థ్యంతో ఏఐ డేటా హబ్‌ ఏర్పాటు చేస్తుంది. దీనిని దశలవారీగా పెంచుతూ పోతుంది.


కనెక్టింగ్‌ ది వరల్డ్‌...

ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ యూజర్లకు మరింత వేగంగా సేవలందించేలా విశాఖలో ఏఐ డేటా హబ్‌ ఏర్పాటవుతుంది. గూగుల్‌ జెమిని ఏఐ, గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ వర్క్‌ స్పేస్‌, యూట్యూబ్‌, గూగుల్‌ క్లౌడ్‌, జీ-మెయిల్‌ తదితర సేవలను ఈ ఏఐ హబ్‌ ద్వారానే గూగుల్‌ అందిస్తుంది. భారత్‌తో మొత్తంగా విశాఖ నుంచి 12 దేశాలకు కనెక్టివిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా సబ్‌ సీ (సముద్ర గర్భం) కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌ నిర్మిస్తోంది. 20 లక్షల మైళ్లకంటే పొడవైన సబ్‌ సీ కేబుల్‌ ద్వారా విశాఖపట్నం ప్రపంచానికి కనెక్టివిటీ కేంద్రంగా మారుతుంది.

మేలి మలుపు...

గూగుల్‌ ఏఐ హబ్‌... విశాఖ నగరానికి, నవ్యాంధ్ర కే కాదు, మొత్తం దేశ ఐటీ రంగ ప్రస్థానంలోనే మేలి మలుపులాంటిది. పెట్టుబడుల పరంగా.. ఉద్యోగాల కల్పనలోనూ కొత్త చరిత్ర సృష్టించనుంది. 2029 నాటికి రాంబిల్లి, అడవివరం, తర్లువాడలో మూడు ఏఐ డేటా సెంటర్లను నిర్మించి కార్యకలాపాలను ప్రారంభిస్తామని గూగుల్‌ ప్రకటించింది. వీటిలో... లక్షన్నర నుంచి రెండు లక్షల మంది నిపుణులు పని చేసే అవకాశముంది. ప్రస్తుతం గిగావాట్‌ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఏఐ హబ్‌... దశలవారీగా నాలుగు గిగావాట్లకు చేరనుంది. అప్పటికి ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపవుతుంది.


కూటమి సర్కారు చొరవతో...

2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే.. సీఎం చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించారు. ప్రఖ్యాత టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, అదానీ డేటా సెంటర్లు కార్యకలాపాలు చేపడతామంటూ ప్రతిపాదించాయి. 2014-19 మధ్య కాలంలోనే విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ వైసీపీ వచ్చాక.. విశాఖను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు తప్ప, అభివృద్ధిపై దృష్టి సారించలేదనే ఆరోపణలున్నాయి. ప్రోత్సాహకాలను ఆపేయడంతో అప్పుడప్పుడే రెక్కలు విచ్చుకుంటున్న ఐటీ రంగం కుదేలైపోయింది. విశాఖలో ఐటీ సంస్థలు, స్టార్టప్‌ యూనిట్లు మూతపడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పురోగతి మొదలైంది.

మళ్లీ అవే కు..విమర్శలు!

గతంలో హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలకు రాయితీలు ఇచ్చినప్పుడు వచ్చినట్లే... ఇప్పుడు గూగుల్‌ ఏఐ హబ్‌కు ఇస్తున్న రాయితీలపైనా రాజకీయ కువిమర్శలు మొదలయ్యాయి. ‘వేల కోట్ల రాయితీలు ఇచ్చేస్తారా’ అంటూ సామాజికవేత్తల ముసుగులో కొందరు రాగాలు తీస్తున్నారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మాణ సమయంలో తక్కువ ధరకే భూములు, స్టాంపు డ్యూటీ మినహాయింపు, విద్యుత్‌, మంచినీటి వసతుల కల్పనను పలు పార్టీలు, సంఘాలు విమర్శించాయి. కానీ ఆ చర్యల కారణంగానే ‘సైబరాబాద్‌’ అనే కొత్త నగరం ఆవిష్కృతమైంది. విశాఖలోనూ ఇదే జరగనుందని అధికారులు పేర్కొంటున్నారు. గూగుల్‌ రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుండగా... రాష్ట్ర ప్రభుత్వం రూ.22వేల కోట్ల విలువైన రాయితీలు ప్రకటించింది. ‘‘ఇతర మెగా పరిశ్రమలకు ఇచ్చినట్లుగానే గూగుల్‌కూ విద్యుత్‌ రాయితీ ఇచ్చాం. అయినప్పటికీ... గూగుల్‌ తమ సొంత గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకుంటుంది. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నాం. గూగుల్‌తోపాటు ఇతర పరిశ్రమలకు ఆ నీటినే అందిస్తాం’’ అని అధికారులు తెలిపారు.


విశాఖకు మహర్దశ

తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా, నవ్యాంధ్ర వాణిజ్య రాజధానిగా, ఐటీ కేంద్రంగా, ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా ఉన్న విశాఖకు ‘గూగుల్‌’ రాకతో మరింత మహర్దశ పట్టడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు ‘మైక్రోసాఫ్ట్‌’ రాకతో ఇతర అనేక అనుబంధ, సంబంధిత కంపెనీలు తరలి వచ్చాయి. ఐటీ రంగ వికాసానికి అవసరమైన ‘ఎకో సిస్టమ్‌’ అభివృద్ధి చెందింది. విశాఖలోనూ ఇదే జరగనుందని... గూగుల్‌ ఐఏ హబ్‌ ఏర్పాటుతో అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకూ వేదికగా మారుతుందని చెబుతున్నారు. మంగళవారం ఢిల్లీలో గూగుల్‌తో ఒప్పందం కుదురుతున్న సమయంలోనే... మరో 4 ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చాయని ఒక ముఖ్య అధికారి వెల్లడించారు. మరో 15 ఐటీ సంస్థలు కూడా పెట్టుబడుల ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. వీటిపై మరింత స్పష్టత వచ్చాక... ఎస్‌ఐపీబీ ఆమోదించేదాకా ఈ వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు.

గూగుల్‌ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ‘ఏఐ హబ్‌’ ఇదే! విశాఖ కేంద్రంగా అనేక దేశాలకు ‘గూగుల్‌’ తన సేవలను అందిస్తుంది.

‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ రోజురోజుకూ విస్తరిస్తోంది. దీనికి అతి భారీ కంప్యూటింగ్‌ సామర్థ్యం అవసరం. క్లస్టర్లలో వేలాది చిప్స్‌ను అనుసంధానించాలి. అందుకే... టెక్‌ కంపెనీలు ప్రత్యేకమైన డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

విశాఖలో గూగుల్‌ ఏఐ హబ్‌ ద్వారా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. అంతేకాదు... ఇతర సంస్థల రాకకూ అవసరమైన ‘ఎకో సిస్టమ్‌’ విశాఖలో అభివృద్ధి చెందుతుంది. తద్వారా... భారత ఐటీ నిపుణులు ఇంకెక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోనే కావాల్సినన్ని కొలువులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 06:43 AM