AP Govt: నేడే గూగుల్‌తో ఒప్పందం
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:45 AM
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు మంగళవారం ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. విశాఖపట్నంలో రూ.88,628 కోట్ల (పది బిలియన్ డాలర్ల)తో గూగుల్...
ఏఐ సిటీగా మారనున్న వైజాగ్!
బాబు బ్రాండింగ్, లోకేశ్ కృషితో అతిపెద్ద పెట్టుబడి
న్యూఢిల్లీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు మంగళవారం ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. విశాఖపట్నంలో రూ.88,628 కోట్ల (పది బిలియన్ డాలర్ల)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌తో ఎంఓయూ కుదరనుంది. దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు ‘‘గూగుల్ ఏఐ హబ్’’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో ఉదయం 10గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)గా రికార్డు సృష్టించబోతోంది. రాష్ట్రచరిత్రలో మైలురాయిగా నిలువబోతోంది. ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. మంత్రి లోకేశ్ గతేడాది అక్టోబరు 31వ తేదీన అమెరికా పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ తర్వాత గూగుల్ ప్రతినిధులతో పలుదఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి. దీని ద్వారా దేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్థిలో ఏపీ కీలక నాయకత్వం వహించబోతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ రాబోయే అయిదేళ్లలో (2026-2030 మధ్య) సుమారు రూ.88,628 కోట్ల(10 బిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువత కోసం ఏఐ నైపుణ్యాభివృద్థి కార్యక్రమాలు అమలు చేస్తారు.
ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖకు మరిన్ని గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశముంది. తద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతోపాటు వ్యాపార అనుకూల విధానాల అమలు ద్వారా ఏపీని జాతీయ స్థాయి ఏఐ ఎక్సలెన్స్ సెంటర్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మార్చబోతోంది. ఇక్కడ ఏర్పాటుచేేస డేటా సెంటర్ ద్వారా గూగుల్ భారత్‌లో ఏఐ ఆధారిత ట్రాన్స్‌ఫర్మేషన్‌ను వేగవంతం చేయనుంది. ఏఐ మౌలిక సదుపాయాలు, భారీ ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌లను ఒకేచోట సమన్వయపరచి.. విశాఖను భారతదేశ ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగా గూగుల్ నిలబెడుతుంది. గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్‌తో సముద్ర గర్భ, భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించి, క్లీన్ ఎనర్జీతో పనిచేేస విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ 2028-2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్‌డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టిస్తుంది. గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. మొత్తం ఐదేళ్లలో సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందని అంచనా. ఈ ప్రాజెక్టును వేగవంతంగా ప్రారంభించడానికి వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్, ఆధునిక మౌలిక సదుపాయాలు, రెన్యువబుల్ ఎనర్జీ, ప్లగ్-అండ్-ప్లే వసతులను ఏపీ ఎకనమిక్ డెవల్‌పమెంట్ బోర్డు, ఐటీ శాఖలు సమన్వయంతో అందించేవిధంగా ఏర్పాట్లు చేశారు.