Renuka Ganga: 59 లక్షల ప్యాకేజీ
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:24 AM
గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి గూగుల్‌లో జాక్‌పాట్ కొట్టింది. ఏలూరు జిల్లాకు చెందిన దేవకోటి రేణుకా గంగ ఆ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఏడాదికి రూ. 59 లక్షల ప్యాకేజీతో...
గూగుల్‌లో జాబ్ కొట్టిన ఏలూరు జిల్లా అమ్మాయి
ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
భీమవరంలో బీటెక్ చదువుతుండగానే ఉద్యోగం
ముదినేపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి గూగుల్‌లో జాక్‌పాట్ కొట్టింది. ఏలూరు జిల్లాకు చెందిన దేవకోటి రేణుకా గంగ ఆ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఏడాదికి రూ. 59 లక్షల ప్యాకేజీతో మంచి చాన్స్ అందుకుంది. ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన రేణుకా గంగ, బీటెక్ ఐటీ బ్రాంచి నాల్గవ సంవత్సరంలో ఉండగానే ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఉద్యోగానికి ఎంపికైంది. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో అత్యధిక ప్యాకేజీతో ఎంపికైనట్లు గూగుల్ యాజమాన్యం నుంచి సెలక్షన్ ఆర్డర్ మంగళవారం రేణుకా గంగకు అందింది. ఆమె వడాలిలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివింది. అనంతరం వేలేరు జవహర్ నవోదయ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివి మంచి మార్కులు సాధించింది. ప్రస్తుతం భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పైనల్ ఇయర్ చదువుతోంది. ఆఫ్ క్యాంపస్ ద్వారా ఉద్యోగాల భర్తీకి గూగుల్ సంస్థ చేపట్టిన ఇంటర్వ్యూలకు ఆమె దరఖాస్తు చేసింది. గూగు ల్ ప్లే స్టోర్‌పై తనకు అప్పగించిన ప్రాజెక్టు వర్క్‌ను 3 నెలల్లో విజయవంతంగా పూర్తి చేసింది. గంగ తండ్రి సత్యనారాయణ ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు.
కలెక్టర్ అవుదామనుకున్నా
సాఫ్ట్‌వేర్ రంగంలో దిగ్గజ సంస్థ గూగుల్‌లో అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఐఏఎ్‌సకు ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అవుదామనుకున్నా. ఈలోగా గూగుల్ ఆఫ్ క్యాంప్‌సలో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాను. సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి ఉద్యోగం అందిపుచ్చుకోవడం సంతోషం కలిగించింది.
- రేణుకా గంగ