Share News

Visakhapatnam: గూగుల్‌ డేటా సెంటర్‌ పనులకు శ్రీకారం

ABN , Publish Date - Dec 09 , 2025 | 05:58 AM

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్‌ డేటా సెంటర్‌ పనులకు శ్రీకారం చుట్టారు.

Visakhapatnam: గూగుల్‌ డేటా సెంటర్‌ పనులకు శ్రీకారం

  • తర్లువాడ భూముల్లో మట్టి నమూనాలు సేకరణ

  • హైవే నుంచి డేటా సెంటర్‌కు నేరుగా వెళ్లేలా రోడ్డు విస్తరణ!

విశాఖపట్నం/ఆనందపురం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్‌ డేటా సెంటర్‌ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన అదానీ కంపెనీ ప్రతినిధులు భూముల మట్టి నమూనాలు సేకరించి పరీక్షకు పంపుతున్నారు. తద్వారా నేల స్వభావానికి అనువుగా నిర్మాణాలు చేపట్టనున్నారు. మరోవైపు భూగర్భ జలాల కోసం కూడా సర్వే చేస్తున్నారు. తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. ఇందులో ప్రభుత్వ భూమి సుమారు 100 ఎకరాలు ఉంది. డీపట్టా భూములకు సంబంధించి 51 మంది రైతుల్లో సగానికి పైగా రైతులు ముందుకురాగా, వారిలో 18 మందికి ఈనెల 6న పరిహారం సొమ్ము జమ చేశారు. మిగిలిన రైతుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భూములు గుర్తించిన ప్రాంతాల్లో రెండు చోట్ల పోలీస్‌ అవుట్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కాగా, అదానీ కంపెనీకి చెందిన పనుల పర్యవేక్షణకు ఇబ్బంది లేకుండా రిటైర్డు పోలీస్‌ అధికారి నేతృత్వంలో బృందం పనిచేస్తోంది. దశల వారీగా రైతుల నుంచి భూములు సేకరించి ఏపీఐఐసీకి అప్పగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మొత్తం భూములు తీసుకున్న తర్వాత ఏపీఐఐసీ అధికారుల పర్యవేక్షణలో డేటా సెంటర్‌ పనులు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. కొద్దిరోజుల్లో పనులు వేగం పుంజుకుంటాయని అంటున్నారు.


హైవే నుంచి రహదారి నిర్మాణం

గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ప్రకటన వచ్చిన తర్వాత హైవే నుంచి గ్రామం మీదుగా వెళ్లే రహదారికి మరమ్మతులు చేశారు. అయితే డేటా సెంటర్‌కు జాతీయ రహదారి నుంచి నేరుగా వెళ్లేందుకు గుడిలోవ పాఠశాల ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న రహదారిని 100 అడుగులకు విస్తరించనున్నారు. ఈ మార్గం గ్రామంతో సంబంధం లేకుండా నేరుగా డేటా సెంటర్‌కు వెళుతుంది. ఇదిలా ఉండగా గూగుల్‌ డేటా సెంటర్‌కు భూములు కేటాయించిన కొండ 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పైకి వెళ్లేందుకు కచ్చా మార్గం ఉంది. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా మొత్తం విస్తీర్ణంపై సర్వే చేశారు.

రైతులకు పరిహారం జమ

ఆనందపురం మండలం తర్లువాడలో డేటా సెంటర్‌కు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందజేత ప్రారంభమైంది. డీపట్టా భూములు ఇచ్చిన రైతుల్లో 18 మంది ఖాతాలకు ఈ నెల 6న డబ్బులు జమ చేశారు. ఎకరాకు సంబంధించి 80 సెంట్లకుగానూ రూ.40 లక్షల వంతున జమ చేశామని, 20 సెంట్ల భూమి మరో చోట కేటాయిస్తామని భీమిలి ఆర్డీవో సంగీత్‌ మాథుర్‌ తెలిపారు.

Updated Date - Dec 09 , 2025 | 05:58 AM