Share News

CM Chandrababu: ఆవిష్కరణలు, అవకాశాలకు కొత్త శకం

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:23 AM

గూగుల్‌ డేటా సెంటర్‌ విశాఖకు రావడం.. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: ఆవిష్కరణలు, అవకాశాలకు కొత్త శకం

  • గూగుల్‌ రాక డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ దిశగా సరికొత్త

  • అధ్యాయం.. ఏఐని ప్రతి ఇంటికీ చేరువ చేస్తాం

  • అప్పుడు మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌ తీసుకొచ్చా

  • ఇప్పుడు గూగుల్‌ విశాఖ వస్తుండడం గర్వకారణం

  • ప్రాజెక్టు కోసం లోకేశ్‌ ఎంతో కష్టపడ్డాడు: సీఎం

  • ప్రధాని టెక్నాలజీని వేగంగా స్వీకరిస్తారు

  • విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ గురించి చెప్పగానే ఫిబ్రవరిలో గ్లోబల్‌ ఏఐ సదస్సుపై ఆలోచన చేశారు

  • మోదీ, కేంద్ర మంత్రులు నిర్మల, వైష్ణవ్‌కు కృతజ్ఞతలు

  • గ్లోబల్‌ కనెక్టివిటీ హబ్‌గా వైజాగ్‌: గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో

  • దేశ ప్రగతిలో ఏపీ కీలక భూమిక: వైష్ణవ్‌

విశాఖలో గూగుల్‌ ఏఐ హబ్‌ ఏర్పాటు ఒప్పందం అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, గూగుల్‌ నెట్‌వర్కింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాస్‌ కోలీ, గూగుల్‌ క్లౌడ్‌ సీఈఓ థామస్‌ కురియన్‌తో కలిసి సెల్ఫీ దిగుతున్న కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

హైటెక్‌ సిటీ నిర్మాణంతో హైదరాబాద్‌ దశ మారింది. ఇప్పుడు విశాఖలో ఏఐ డేటా హబ్‌ రాకతో ఏపీ దశ మారుతుంది.ప్రధాని మోదీ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటారు. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు గురించి చెప్పగానే ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్లోబల్‌ ఏఐ సదస్సు నిర్వహించే విషయమై ఆలోచన చేశారు. ఈ రోజు ఏపీకి ఎంతో శుభప్రదం, సంతోషకరమైన రోజు.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

న్యూఢిల్లీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): గూగుల్‌ డేటా సెంటర్‌ విశాఖకు రావడం.. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆవిష్కరణలు, అవకాశాలకు కొత్త శకంగా అభివర్ణించారు. విశాఖలో ఏఐ డేటా హబ్‌ ఏర్పాటు కోసం గూగుల్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందంపై మంగళవారం ఢిల్లీలో సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్వినీ వైష్ణవ్‌, రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు.


వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టాలని గూగుల్‌ నిర్ణయించడం సంతోషమని సీఎం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ భారీ పెట్టుబడి భారత డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో సరికొత్త అధ్యాయంగా పేర్కొన్నారు. దేశంలో మొదటి గిగావాట్‌-స్కేల్‌ డేటా సెంటర్‌ విశాఖకు రావడం ఏపీకి గర్వకారణమన్నారు. ‘రియల్‌ టైమ్‌ డేటా, హిస్టారికల్‌ డేటాల సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీని భారత్‌ వేగంగా అందిపుచ్చుకుంటోంది. ఏపీలో కృత్రిమ మేధ (ఏఐ)ను ప్రతి కుటుంబానికీ చేరువ చేసేందుకు ప్రయత్నిస్తాం. 1990ల చివర్లో మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌ తీసుకొచ్చాను. ఈ రోజు గూగుల్‌ విశాఖ వస్తుండడం నాకు గర్వకారణం’ అని తెలిపారు. హైటెక్‌ సిటీ నుంచి 2025లో ఏఐ డేటా సెంటర్‌ వరకు స్ఫూర్తిదాయకమైన పరివర్తనను చూస్తున్నామన్నారు. విశాఖకు గూగుల్‌ రావడంలో లోకేశ్‌ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆయన గూగుల్‌తో కలిసి చాలా సన్నిహితంగా పనిచేశాడు.. వారి కార్యాలయాన్ని సందర్శించాడు.. చాలా సమయం కేటాయించాడు.. క్రమం తప్పకుండా నాకు సమాచారం అందించాడు. ఈ ప్రాజెక్టును 12 నెలల్లో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. 13 నెలలు పట్టినప్పటికీ.. మొత్తానికి సాధించగలిగాం. ఈ విజయం పట్ల గర్వపడుతున్నాను’ అని తెలిపారు. గూగుల్‌ ప్రాజెక్టుకు సహకరించిన ప్రధానికి, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.


  • ప్రగతిశీల విధానాల వల్లే: నిర్మల

గూగుల్‌ డేటా ప్రాజెక్టు అత్యంత వేగంగా అమల్లోకి రావడం దేశ ప్రగతిలో అత్యంత కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. దార్శనిక నేతలు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆలోచనలు, ప్రగతిశీల విధానాలు, నిర్ణయాల్లో వైవిధ్యం వల్లే గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు సాకారమైందని తెలిపారు. కేంద్రంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ తరహా సుపరిపాలన ఉందని చెప్పారు. టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలు దేశ ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్నాయని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. దేశంలో డేటా సెంటర్‌ పాలసీ ద్వారా ఈ తరహా డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని, 2047-వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇలాంటి పోటీ అవసరమని చెప్పారు.


దేశాల అనుసంధానానికి విశాఖ హబ్‌ వేదిక: కురియన్‌

ఏఐ డేటా హబ్‌ ఏర్పాటుతో గ్లోబల్‌ కనెక్టివిటీ హబ్‌గా విశాఖపట్నం మారుతుందని గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌ అన్నారు. ఈ డేటా సెంటర్‌ ద్వారా వివిధ సంస్థలకు సరైన అవకాశాలు లభిస్తాయని అన్నారు. భారత్‌తో పాటు వివిధ దేశాలను అనుసంధానించేందుకు విశాఖలోని డేటా హబ్‌ వేదిక అవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, గూగుల్‌ గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాస్‌ కోలీ, టీడీపీ ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, కలిశెట్టి అప్పలనాయడు, సానా సతీశ్‌, జీఎం హరీశ్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గూగుల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


  • దేశానికే తలమానికం

  • ఇటువంటి సంస్థల రాకతో కలిగే మేలును ప్రజలకు వివరించాలి

  • డేటా సెంటర్‌ ప్రయోజనాలపై సామాన్యులకూ అవగాహన కల్పించాలి.. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఏపీ బ్రాండ్‌ పునరుద్ధరణతోనే 16 నెలల్లో భారీ పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ ఐటీ చరిత్రలోనే పెద్ద మలుపు కానుందని చెప్పారు. మంగళవారం గూగుల్‌ ఒప్పందంపై సంతకాల తర్వాత ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకున్న ఆయనకు.. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు శుభాకాంక్షలతో స్వాగతం పలికారు. ‘థాంక్యూ సీఎం సార్‌’, గూగుల్‌ కమ్స్‌ టు ఏపీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారితో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గూగుల్‌ సంస్థను సంప్రదించి.. నిరంతరం ఫాలోఅప్‌ చేయడం వల్లే లక్ష్యాన్ని చేరుకున్నామని.. ఇందులో లోకేశ్‌ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ‘ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుతో విద్య, వైద్యం, వ్యవసాయం సహా అనేక రంగాల్లో కీలక మార్పులు వస్తాయి. ఇటువంటి సంస్థల రాకతో కలిగే మేలును ప్రజలకు వివరించాలి. సామాన్యులకు సైతం డేటా సెంటర్‌ ప్రయోజనాలేంటో తెలిసేలా అవగాహన కల్పించాలి’ అని వారికి సూచించారు.


  • ట్రెండింగ్‌లో ‘గూగుల్‌ కమ్స్‌ టు ఏపీ’

‘గూగుల్‌ కమ్స్‌ టు ఏపీ’ హ్యాష్‌ట్యాగ్‌ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. ఢిల్లీలో మంగళవారం గూగుల్‌తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం కార్యక్రమం జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో ‘ఎక్స్‌’లో మొదటి స్థానంలో ట్రెండ్‌ అయింది. ఈ ఒప్పందంపై సీఎం చంద్రబాబు ‘ఓకే గూగుల్‌.. సింక్రనైజ్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌’ అని పోస్టు చేశారు. ఈ పోస్టును అశ్వినీ వైష్ణవ్‌, నిర్మలా సీతారామన్‌, లోకేశ్‌, గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌, గూగుల్‌ నెట్‌వర్కింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాస్‌ కోలీకి ట్యాగ్‌ చేశారు.


  • డేటా ఇంధనమైతే.. డేటా సెంటర్‌ రిఫైనరీ

  • విశాఖ ఏఐ హబ్‌తో గ్రామాల్లో విస్తృత సేవలు

  • ఈ మజిలీలో కనిపించని హీరోలెందరో!

  • సాంకేతిక మార్పులకు అనుగుణంగా యువత నైపుణ్యం పెంచుకోవాలి

  • మనవాళ్లను కొత్త అవకాశాలకు సిద్ధం చేయాలి

  • ఇందుకు గూగుల్‌ మార్గనిర్దేశం కోరుతున్నా: లోకేశ్‌

విశాఖలో ఏఐ హబ్‌ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌, గూగుల్‌కే కాదు.. యావద్దేశానికే చరిత్రాత్మకమైందని లోకేశ్‌ అన్నారు. ‘గూగుల్‌ డేటా సెంటర్‌ గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, విస్తృతమైన సేవలను అందించబోతోంది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ముందుండి నడిపించడం గర్వకారణంగా భావిస్తున్నాం. ఏఐ హబ్‌ కేవలం భారత్‌, ఏపీకే గాక ప్రపంచ వేదికపై మన దేశం కీలకపాత్ర పోషించేలా చేస్తుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు ఈ ప్రాజెక్టు కోసం సమష్టిగా కలసి పనిచేశాయి. ’డేటా ఇంధనం అయితే.. డేటా సెంటర్లు రిఫైనరీల లాంటివి. 12 నెలల్లో పూర్తవుతుందనుకున్న ఏఐ హబ్‌ ఎంవోయూ ఒక నెల ఆలస్యమైంది. ఇదో ఉత్సాహభరితమైన ప్రయాణం. ఈ మజిలీలో ఎందరో కనిపించని హీరోలు ఉన్నారు. అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన యువత నైపుణ్యం పెంచుకోవాలి. ఏఐని స్వీకరించాలి. పాఠ్యాంశాలను పునర్వ్యవస్థీకరించాలి. మన యువతను కొత్త అవకాశాలకు సిద్ధం చేయాలి. గతంలో వై2కే విప్లవం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల రూపురేఖలు మార్చింది. ఇప్పుడు ఏఐతో కొత్తతరం పట్టణాలు అభివృద్థి చెందబోతున్నాయి. సీఎం.. విద్య, ఐటీని ఒకే గొడుగు కిందకు తెచ్చి, ఆ బాధ్యతలను నాకు అప్పగించారు. ఈ రెండు రంగాల్లో క్షేత్ర స్థాయి అత్యుత్తమ ఫలితాలను తేవడమే నా లక్ష్యం’ అని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా అమలు చేస్తుందని.. అటువంటి నిర్ణయం భారత్‌కు, ప్రపంచానికి కూడా ఒక నమూనాగా మారుతుందని తెలిపారు. ‘మా లక్ష్యాలను అధిగమించేందుకు గూగుల్‌ మార్గదర్శకత్వం వహించి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. విశాఖ ఏఐ హబ్‌ మన యువతను తర్వాతితరం సాంకేతిక విప్లవానికి సిద్థం చేస్తుంది’ అని తెలిపారు.

Updated Date - Oct 15 , 2025 | 04:24 AM