కంది రైతులకు శుభవార్త
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:02 AM
కంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. జనవరి మొదటి వారం నుంచి ఉమ్మడి జిల్లాలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాం రూ.8వేలను అందించేందుకు మార్క్‌ఫెడ్ సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జనవరి నుంచి కొనుగోళ్లు
ఉమ్మడి జిల్లాలో 40వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం
10లక్షల గన్నీ బ్యాగులు సిద్ధం
ఏర్పాట్లు చేస్తున్న మార్క్‌ఫెడ్ అధికారులు
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. జనవరి మొదటి వారం నుంచి ఉమ్మడి జిల్లాలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాం రూ.8వేలను అందించేందుకు మార్క్‌ఫెడ్ సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 14,788 టన్నులు, నంద్యాల జిల్లాలో 25,875 టన్నుల కందులను రైతుల నుంచి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలకు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టారు. కేంద్ర సంస్థ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన ఆఫ్ ఇండియా నిబంధనలతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3లక్షల ఎకరాలకు పైగా ఖరీ్‌ఫలో కంది పంటను సాగు చేశారు. దాదాపు నెల రోజుల నుంచి కర్నూలు మార్కెట్ యార్డుకు రైతులు కందులను అమ్మకానికి తీసుకువస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటానికి కేవలం రూ.7వేలు మాత్రమే అందుతుండటంతో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు తమ కందులను మార్క్‌ఫెడ్ సంస్థ ఎప్పుడెప్పుడా కొనుగోలు చేస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కందులు, మినుములు, పెసలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని లెటరు రాశారు. ఇందులో భాగంగా కేంద్రం గ్రీనసిగ్నల్ ఇవ్వగా.. మార్క్‌ఫెడ్ సంస్థ రైతుల నుంచి కందులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. కోల్‌కత్తా నుంచి 10లక్షల గోనెసంచులు రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లు అధికారులు తెలిపారు.
వ్యాపారులకు అమ్ముకుని నష్టపోవద్దు
కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి క్వింటానికి రూ.8వేలు మద్దతు ధరతో కందులను కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. జనవరి మొదటి వారం నుంచి కం దులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు తొందరపడి వ్యాపారులకు తక్కువ ధరకు కందులను అమ్మి నష్టపోవద్దు.
ఫ హరినాథ్, మేనేజర్, మార్క్‌ఫెడ్, నంద్యాల