రైతులకు శుభవార్త
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:31 PM
అన్నదాతకు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.
ఆగస్టు 2న మొదటి విడత ‘అన్నదాత సుఖీభవ’
రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరున్నర లక్షల మంది రైతులు
4.31లక్షల మందికి మాత్రమే లబ్ధి
ఇంకా కొనసాగుతూనే ఉన్న కౌలురైతుల గుర్తింపు
అన్నదాతకు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పంట సాగు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పెట్టుబడి మొత్తాన్ని ఎప్పుడెప్పుడు జమ చేస్తారోనని మే మాసం నుంచి ఎదురుచూస్తున్న రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్తను అందిం చింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన సమ్మాన యోజన పథకం ద్వారా రూ.2వేలు కలిపి మొత్తం రూ.7వేలను ఆగస్టు 2వ తేదీన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసిందని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతులతో కలిపి 6.50 లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతలందరినీ పీఎం కిసానతో పాటు కౌలురైతుల గుర్తింపునకు ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం రెండు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అర్హత పొందని రైతులు మొర పెట్టుకుంటున్నారు
కర్నూలు అగ్రికల్చర్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాలుగున్నరలక్షల మంది రైతులకు అన్నదాత సుఖభవతో పాటు పీఎం కిసాన సమ్మాన యోజన పథకం మొదటి విడత రూ.7వేలు అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈమొత్తానికి అర్హులైన రైతుల జాబితాలు ఇప్పటికే రెండు జిల్లాలో వ్యవసాయ యంత్రాంగం పూర్తిచేసింది. ‘అన్నదాత సుఖీభవ’ కింద కూటమి ప్రభుత్వం కేంద్రం ఇచ్చే డబ్బులను కలిపి ఏడాదికి రూ.20వేలను మూడు విడతల్లో అందిస్తారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో కేంద్రం వాటా రూ.6వేలు కాగా రాష్ట్రం వాటా రూ.14వేలు ఉంది. పీఎం కిసాన సమ్మాన యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలను మూడు విడతలుగా ఒక్కో విడతలో రూ.2వేల చొప్పున రైతుల ఖాతాకు జమ చేస్తుంది. అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. తొలి విడతలో రూ.7వేలు, రెండో విడతలో రూ.7వేలు, మూడో విడతలో రూ.6వేలు మొత్తం రూ.20వేలు ఒక ఏడాదికి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కానున్నాయి.
కౌలు రైతులతో కలిపి..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలురైతులతో కలిపి 6.50లక్షల మంది రైతులున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతలందరినీ పీఎం కిసానతో పాటు కౌలురైతుల గుర్తింపునకు ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం 2లక్షల మంది రైతులు పెట్టుబడి సాయానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అర్హత పొందని రైతులు మొర పెట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో 2,50,634 మంది రైతులు మాత్రమే ఇప్పటి దాకా ఇకేవైసీ, ఈక్రాఫ్ బుకింగ్ పూర్తిచేసుకుని మొదటి విడత ఆర్థికసాయానికి అర్హత సాధించారు. వివిద కారణాలతో 7,601 మంది లబ్ధి పొందలేని పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లాలో 1,80,787 మంది మాత్రమే ప్రభుత్వ సాయానికి అర్హత సాధించారు. ఇంకా 4,510 మందికి ఆర్థిక సాయం అందించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రెండు జిల్లాలో 12,111 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సాయానికి దూరమవుతున్నారు. వీరందరినీ అర్హత జాబితాలో చేర్చేందుకు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 2వ తేదీకి ఈకసరత్తు పూర్తయితేనే వీరందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందుతుంది.
కౌలురైతుల గుర్తింపు ప్రక్రియ..
కౌలు రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంది. గ్రామాల్లో కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ నత్తను తలపిస్తోంది. కర్నూలు జిల్లాలో 25వేల మంది కౌలు రైతులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికీ 2,695 మంది రైతులకే గుర్తింపు కార్డులు ఇచ్చారు. నంద్యాల జిల్లాలో 30వేల మంది కౌలు రైతులకు గానూ కేవలం 4,030 మంది కౌలు రైతులకు మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారు. రెండు జిల్లాలో 55వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నా కూడా కేవలం 7వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారు.
అర్హత ఉన్న రైతులందరికీ..
అర్హత ఉన్న రైతులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ మొదటి విడత రూ.7వేలను ఆగస్టు 2న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. కర్నూలు జిల్లాలో ఈకేవైసీ తదితర కారణాల వల్ల అర్హత కోల్పోయిన రైతులందరికీ ఆటంకాలను తొలగించి వారిని కూడా లబ్ధిదారులుగా చేర్పించే కార్యక్రమం చేపట్టాం.
ఫ వరలక్ష్మి, జేడీ, కర్నూలు