పత్తి రైతులకు శుభవార్త
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:50 PM
దసరా పండుగ వేళ కూటమి ప్రభుత్వం పత్తి రైతులకు శుభవార్త అందించింది. ఖరీప్‌లో సాగుచేసిన పత్తికి క్వింటానికి రూ.8110లు అందేలా చర్యలు తీసుకోవాలని సీసీఐని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
క్వింటం పత్తి ధర రూ.8,110లు
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ వేళ కూటమి ప్రభుత్వం పత్తి రైతులకు శుభవార్త అందించింది. ఖరీప్‌లో సాగుచేసిన పత్తికి క్వింటానికి రూ.8110లు అందేలా చర్యలు తీసుకోవాలని సీసీఐని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్నదాతలు పండించిన పత్తిని దళారుల జోక్యం లేకుండా వారు నేరుగా విక్రయించి లబ్ధి పొందేందుకు సీసీఐ కసరత్తు చేస్తుంది. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచడంతో కపాస్ కిసాన యాప్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈనెల మొదటి వారంలో పత్తి సేకరణ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు కపాస్ కిసాన యాప్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులొచ్చాయి
అక్టోబరు నుంచి రైతుల ద్వారా సీసీఐ పత్తి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి ఎలాంటి అక్రమాలు, పొరపాట్లు జరగకుండా సీసీఐ కేంద్రాలకే రైతులు పత్తిని తీసుకెళ్లి నేరుగా అమ్ము కునేందుకు కేంద్రం కపాస్ కిసాన యాప్‌ను అమలులోకి తెచ్చింది. పత్తి పండించిన రైతులందరూ ఇప్పటి నుంచే ఈయాప్‌లో తమ పొలంతో పాటు బ్యాంకు వివరాలను నమోదు చేసుకోవాలి.