Share News

రూ.58.56 లక్షలు గోల్‌మాల్‌!

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:44 AM

ఉంగుటూరు మండలంలోని పొట్టిపాడు, పెదఅవుటపల్లి, ఎన్‌ అప్పారావుపేట పంచాయతీల్లో రూ.58.56 లక్షల నిధులు గోల్‌మాల్‌ అయ్యాయి. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులతో కలిసి ఎంపీడీవో స్వాహా చేశారు. సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరిపి సమగ్ర నివేదిక కలెక్టర్‌కు అందజేశారు. నిధుల దుర్వినియోగం నిర్ధారణ కావడంతో నోటీసులు జారీ చేశారు. పది రోజుల్లో నగదు చెల్లించాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

రూ.58.56 లక్షలు గోల్‌మాల్‌!

- ఉంగుటూరు మండలంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం

- గత ఎంపీడీవో, ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల నిర్వాకం

- సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో డీఎల్‌పీవో విచారణ

- నిర్ధారణ కావడంతో నోటీసులు జారీ చేసిన కలెక్టర్‌ బాలాజీ

- పది రోజుల్లో నగదు చెల్లించాలని ఆదేశాలు

- లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

- ప్రస్తుతం పామర్రు ఎంపీడీవోగా పనిచేస్తున్న జ్యోతి

ఉంగుటూరు మండలంలోని పొట్టిపాడు, పెదఅవుటపల్లి, ఎన్‌ అప్పారావుపేట పంచాయతీల్లో రూ.58.56 లక్షల నిధులు గోల్‌మాల్‌ అయ్యాయి. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులతో కలిసి ఎంపీడీవో స్వాహా చేశారు. సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరిపి సమగ్ర నివేదిక కలెక్టర్‌కు అందజేశారు. నిధుల దుర్వినియోగం నిర్ధారణ కావడంతో నోటీసులు జారీ చేశారు. పది రోజుల్లో నగదు చెల్లించాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

ఉంగుటూరు మండలంలో గతంలో పనిచేసిన ఎంపీడీవో, మరో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. తమకు ఉన్న వెసులుబాటును ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా నగదును పక్కదారి పట్టించారు. వివరాల్లోకి వెళితే.. ఉంగుటూరు మండలంలో పరిపాలనాపరంగా ఎలాంటి అనుమతులు లేకుండా పంచాయతీల నిధులను దారి మళ్లించిన అంశంపై సామాజిక కార్యకర్త ఎం.సుబ్రహ్మణ్యం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుడివాడ డీఎల్‌పీవో స్పందించి మండలంలోని పొట్టిపాడు, పెదఅవుటపల్లి, ఎన్‌ అప్పారావుపేట పంచాయతీల్లో విచారణ జరిపారు. నిధుల దుర్వి నియోగంపై నివేదికను జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) ద్వారా కలెక్టర్‌కు సమర్పించారు. దీనిపై ఎంపీడీవో, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్‌ నోటీసులను ఇటీవల జారీ చేశారు. నోటీసులు అందుకున్న 10 రోజుల వ్యవధిలో నగదు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. నగదు చెల్లించకుంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు.

ఎంపీడీ వో దారి మళ్లించిన నగదు రూ.29.28 లక్షలు

ఉంగుటూరు ఎంపీడీవోగా కె.జ్యోతి 2019 సెప్టెంబరు నుంచి 2021 ఏప్రిల్‌ వరకు పనిచేశారు. ఆ సమయంలో పలు పంచాయతీలకు ఆమె ప్రత్యేక అధికారిగా కూడా కొనసాగారు. ఎలాంటి అనుమతులు లేకుండా, తనకు ఉన్న అధికారంతో తన బ్యాంకు ఖాతాకు మొత్తం రూ.29.28 లక్షలను మళ్లించుకున్నట్లు విచారణ అధికారులు నిర్థారించారు. జ్యోతి బదిలీల్లో భాగంగా ప్రస్తుతం పామర్రు ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. పొట్టిపాడు పంచాయతీ కార్యదర్శిగా 2019 ఆగస్టు నుంచి 2020 అక్టోబరు వరకు పనిచేసిన ఎం.అమీర్‌బాషా, అదే పంచాయతీలో 2020 అక్టోబరు నుంచి 2021 ఆగస్టు వరకు పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వై.వెంకటేశ్వరరావు రూ.13.35 లక్షల పంచాయతీ నిధులను దారి మళ్లించినట్లు అధికారులు కలెక్టర్‌కు నివేదికను అందజేశారు.

పెదఅవుటపల్లి పంచాయతీలోనూ..

గతంలో పెద అవుటపల్లి పంచాయతీ ప్రత్యేక అధికారిగా కూడా ఎంపీడీవో జ్యోతి పనిచేశారు. 2018 డిసెంబరు నుంచి 2021 ఆగస్టు వరకు పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన వై.వెంకటేశ్వరరావుతో కలిసి రూ.43.84 లక్షల నిధులను పక్కదారి పట్టించినట్లు అధికారులు తమ విచారణలో తేల్చారు. ఎన్‌ అప్పారావుపేట పంచాయతీ నుంచి ఎంపీడీవో జ్యోతి, పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన ఎం.అమీర్‌ బాషా, వై.వెంకటేశ్వరరావు రూ.1.37 లక్షల నగదును దుర్వినియోగం చేసినట్లుగా నివేదికను సమర్చించారు. మూడు పంచాయతీలలో మొత్తంగా ఎంపీడీవో రూ.29.28 లక్షలు, ఇద్దరు కార్యదర్శులు రూ.29.28 లక్షల నిధులను దుర్వినియోగం చేసినట్లుగా విచారణ అధికారులు నిర్ధారించారు. కాగా, పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేసిన వై.వెంకటేశ్వరరావు ఇటీవల చనిపోయారు.

Updated Date - Sep 20 , 2025 | 12:44 AM