Share News

Kurnool: జొన్నగిరికి పసిడిసిరి

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:10 AM

కరువుసీమలో పసిడికాంతులు విరియనున్నాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి బంగారం శుద్ధి కర్మాగారం రానుంది. ఆస్ట్రేలియాకు చెందిన జియోమైసూర్‌ కంపెనీ తన భాగస్వాములైన...

 Kurnool: జొన్నగిరికి పసిడిసిరి

  • కరువుసీమలో బంగారం శుద్ధి కర్మాగారం.. కర్నూలు జిల్లాలో ఏర్పాటుకు సిద్ధమైన ‘జియోమైసూర్‌’

  • 200కోట్ల పెట్టుబడి..550 మందికి ఉపాధి

  • ఏడాదికి 750 కిలోల నిక్షేపాల వెలికితీత లక్ష్యం

  • లీజు విధానంలో 1500 ఎకరాల సేకరణ

  • ఈ ఏడాది చివర్లో ప్రారంభానికి సన్నాహాలు

(పత్తికొండ/తుగ్గలి-ఆంధ్రజ్యోతి)

కరువుసీమలో పసిడికాంతులు విరియనున్నాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి బంగారం శుద్ధి కర్మాగారం రానుంది. ఆస్ట్రేలియాకు చెందిన జియోమైసూర్‌ కంపెనీ తన భాగస్వాములైన డెక్కన్‌, త్రివేణి కంపెనీలతో కలిసి జొన్నగిరి, పరిసర గ్రామాల్లో ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసింది. రైతుల నుంచి భూముల సేకరణ.. కేంద్రం అనుమతులు.. గ్రామసభ తీర్మానాలు.. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు.. అన్నీ పూర్తిచేసుకుని ఈ ఏడాది చివరకు కర్మాగారంలో పనులు మొదలుపెట్టేందుకు జియోమైసూర్‌ సిద్ధమవుతోంది. హంద్రీనీవా నుంచి నీరు తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడం ద్వారా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహం అందిస్తోంది. రూ.200 కోట్లతో ఏర్పాటయ్యే ఈ కర్మాగారంలో 550మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది.


మూడు దశాబ్దాల కిందటే..

జొన్నగిరి ప్రాంతంలో మూడు దశాబ్దాల క్రితమే కేంద్ర ప్రభుత్వం పసిడి అన్వేషణ మొదలుపెట్టింది. ఇందుకోసం జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎ్‌సఐ) జొన్నగిరి, పగడిరాయి గ్రామాల్లో పరిశోధనలు చేసింది. ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తేల్చింది. అయితే వాటి వెలికితీతకు చాలా ఖర్చవుతుందని తేలడంతో ఆ ఆలోచనను విరమించుకుంది. ఆతర్వాత 2005లో జియోమైసూర్‌ రంగంలోకి దిగింది. ఇక్కడ పసిడి పరిశోధనల కోసం అనుమతులు పొందింది. దొన ప్రాంతంలో తవ్వకాలు చేసి పసిడి నిక్షేపాలను అంచనావేసే దిశగా పరిశోధనలు చేసింది. ఈ క్రమంలో జొన్నగిరి, పగడిరాయి, బొల్లబానిపల్లె, ఎర్రగుడి గ్రామాలపరిధిలో సుమారు 1,500 ఎకరాల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ భూములను రైతుల నుంచి లీజుకు తీసుకుంది. ఏడాదికి ఎకరాకు రూ.14 వేలు లీజు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత లీజును రూ.18 వేలకు పెంచింది. ఏడాదికి 750 కిలోల పసిడి ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటయ్యే ఈ పరిశ్రమకు 2023లోనే కేంద్ర ప్రభుత్వం అనుమతులు లభించాయి. ఈ ఏడాది పనులు ప్రారంభిస్తామని జియోమైసూర్‌ భాగస్వామ్య కంపెనీ ‘డెక్కన్‌’ ముఖ్య ప్రతినిధి ఢిల్లీలో ప్రకటించారు.


మండలాలుగా విభజన

లీజులకు తీసుకున్న భూముల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద ప్రతి 20 మీటర్లకు ఒకచోట డ్రిల్లింగ్‌ జరిపారు. అక్కడ బంగారు గని నాణ్యత, లాభనష్టాలపై జరిపిన పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో పూర్తిస్థాయి గోల్డ్‌ మైనింగ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు జియోమైసూర్‌ శ్రీకారం చుట్టింది. రోజుకు వెయ్యి టన్నుల మట్టిని యంత్రాలద్వారా జల్లెడ పట్టనుంది. బంగారు గనిలో 1.5 టన్నుల మట్టి నుంచి ఒక గ్రాము బంగారాన్ని ఊత్పత్తి చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. కాగా, జొన్నగిరి, పగడిరాయి, ఎర్రగుడి, బొల్లవానిపల్లె గ్రామాల పరిధిలో లీజుకు తీసుకున్న భూములను ఉత్తర, దక్షణ, తూర్పు, పడమట మండలాలుగా జియోమైసూర్‌ కంపెనీ విభజించింది. ఇందులో తూర్పు మండలంలో కార్మాగారం ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. అమెరికా, చైనా దేశాల నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుంది. రాష్ట్రప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే కర్మాగారాన్ని ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

కర్మాగారానికి హంద్రీనీవా నీరు..

నీటి అవసరాల కోసం మినీరిజర్వాయర్‌ను కంపెనీయే నిర్మించింది. ప్రభుత్వం హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా ఏడాదికి 0.021 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. మద్దికెర మండలం ఎడవలి గ్రామంవద్ద హంద్రీనీవా కాలువ నుంచి తూర్పు మండలంలో తాము నిర్మించుకున్న మినీ రిజర్వాయర్‌కు 21 కిలోమీటర్ల మేర కంపెనీ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసుకుంది. హంద్రీనీవా నీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసుకున్న పైప్‌లైన్‌ పనితీరును పరిశీలించేందుకు ట్రయల్‌రన్‌ పూర్తిచేశారు.


సేవాకార్యక్రమాలు..

బంగారు నిక్షేపాలను గుర్తించిన గ్రామాల్లో కంపెనీ ప్రతినిధులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. జొన్నగిరి బాలుర హాస్టల్‌, పాఠశాల మరమ్మతుల కోసం నిధులను వెచ్చించారు. గ్రామ వైద్య అవసరాల కోసం ప్రత్యేక అంబులెన్స్‌ను ఏర్పాటుచేశారు. పాఠశాల విద్యార్థులకు బస్సుసౌకర్యం ఏర్పాటుచేశారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. భూములు పూర్తిగా కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నామని, కొన్ని కుటుంబాల్లో ఇద్దరికి కూడా ఉద్యోగాలను అందించామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

నాడు సువర్ణగిరి.. నేడు జొన్నగిరి

ప్రాచీన కాలంలో జొన్నగిరి ప్రాంతాన్ని సువర్ణగిరిగా పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడి భూముల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని ఆనాడే గుర్తించారేమో..! అందుకే సువర్ణగిరి అని పిలిచేవారని స్థానికులు అంటున్నారు. కాలక్రమేనా సువర్ణగిరి కాస్తా.. సొన్నగిరిగా.. ఆ తరువాత జొన్నగిరి రూపాంతరం చెందింది. అశోకుడి సామ్రాజ్యానికి దక్షిణ ప్రాంత ప్రధాన కార్యాలయంగా జొన్నగిరి ఉండేదని అంటున్నారు. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన అశోకుని శిలా శాసనాలను జొన్నగిరి సమీపంలో గుర్తించారు. ఆలయానికి సమీపంలో పెద్ద రాతిబావి ఉంది. బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు ఈ బావి తవ్వి ఉండవచ్చని తెలుస్తోంది. చోళుల కాలంలో కూడా జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉండేవని చరిత్ర చెబుతోంది. బ్రిటీష్‌ కాలంలో కూడా బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ జరిగినట్టు తెలుస్తోంది.

Updated Date - Sep 23 , 2025 | 05:10 AM