Share News

Revenue Department: సాదా బైనామాలకు మోక్షం

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:55 AM

గ్రామీణ చిన్న, సన్నకారు రైతులకు సువర్ణావకాశం! సాదాబైనామాలతో జరిగిన భూములు లావాదేవీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.

Revenue Department: సాదా బైనామాలకు మోక్షం

  • భూముల రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తుల సమర్పణకు మరో అవకాశం

  • 2027 డిసెంబరు 31 వరకు గడువు

  • 90 రోజుల్లో రైతుల దరఖాస్తుల పరిష్కారం

  • అవకాశాన్ని ఉపయోగించుకోవాలి: మంత్రి అనగాని

అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): గ్రామీణ చిన్న, సన్నకారు రైతులకు సువర్ణావకాశం! సాదాబైనామాలతో జరిగిన భూములు లావాదేవీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. సంబంధిత పత్రాలతో 2027 డిసెంబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు ఇచ్చింది. 2024 జూన్‌ 15 నాటికి లావాదేవీలు జరిగి, సాదాబైనామాలు రాసుకున్న భూములపై రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంప్‌డ్యూటీ మినహాయిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు (జీవో 467) జారీచేశారు. సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌ కోసం సంబంధిత మండలం పరిధిలోని మీసేవ, గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు ఫామ్‌-10తోపాటు దరఖాస్తులు సమర్పించాలి. ఇందుకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భూములు కొన్న వారు లేదా అమ్మిన రైతులు దరఖాస్తులు సమర్పించాలి. వాటిని అధికారులు పరిశీలించి జీవో ప్రకారం చర్యలు తీసుకుంటారు. సాదాబైనామాల రిజిస్ట్రేషన్లపై స్థానిక తహసీల్దార్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడంతో పాటు ఊరూరా ప్రచారం కూడా కల్పిస్తారు. కాగా, రైతులు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించింది. ‘ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌’ విధానంలో దరఖాస్తుల పరిష్కారం చేయాలని, ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావులేదని స్పష్టతనిచ్చింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పేద రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సూచించారు.


సరైన ఆధారాలు సమర్పించలేని పక్షంలో..

గతంలో చిన్న చిన్న కారణాలతో సాదాబైనామాల దరఖాస్తులను తిరస్కరించారని, ఈసారి అలా జరగడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు సరైన ఆధారాలు సమర్పించలేని పక్షంలో వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి.. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన సమాచారం, ఇంకా పంటల బీమా, పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ వంటి వివరాలను తెప్పించుకోవాలని ఆదేశించారు. రైతుకు భూములన్న ప్రాంతంలో చుట్టుపక్కల సాగుదారులను విచారించి వివరాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తాము విచారణకు వెళ్లినప్పుడు చుట్టుపక్కల రైతులు అందుబాటులో లేరని, సంబంధిత రైతు పొజిషన్‌లో లేరంటూ దరఖాస్తులను తిరస్కరించవద్దని, దరఖాస్తుదారు లేదా చుట్టుపక్కల రైతులు విచారణను వాయిదా వేయాలని కోరితే ఆ పని చేయాలని, అందరికీ ఆమోదయోగ్యమైన తేదీల్లో విచారణ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. సాదాబైనామా రిజిస్ట్రేషన్లు గ్రామీణ ప్రాంత ంలోని సాగు భూములకే వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా, రాష్ట్ర ప్రధాన కేంద్రాలు, నగర ప్రాంతాలు, వాటి పరిధిలోని భూములకు వర్తించదు. అలాగే ప్రభుత్వ, అసైన్డ్‌ భూములకు ఈ విధానం వర్తించదు.

Updated Date - Dec 05 , 2025 | 04:56 AM