Nellore: చౌక బంగారం ఆశ చూపి డబ్బులు దోచేస్తారు
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:03 AM
హాయ్.. సార్!! మీరు చౌకగా బంగారం కావాలా?. మార్కెట్ ధర కంటే బాగా తగ్గించి ఇస్తాం. విదేశాల నుంచి మేలిమి బంగారం తెప్పిస్తాం. వాటికి బిల్లులు ఉండవు.
నెల్లూరులో ‘ట్రాప్’ ముఠా ఆగడాలు
మీడియేటర్లతో వల.. మాయ మాటలతో ఓ ఇంటికి తీసుకెళ్లి దాడులు
రెండు నెలల్లో పది దోపిడీలు
నెల్లూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘హాయ్.. సార్!! మీరు చౌకగా బంగారం కావాలా?. మార్కెట్ ధర కంటే బాగా తగ్గించి ఇస్తాం. విదేశాల నుంచి మేలిమి బంగారం తెప్పిస్తాం. వాటికి బిల్లులు ఉండవు. అందుకే అంత తక్కువ ధరకు అమ్ముతున్నాం. మంచి అవకాశం!.’ అంటూ ఆ ట్రాప్ గ్యాంగ్ ముఠా సభ్యులు మాయ మాటలు చెబుతారు. వారి వలలో పడ్డారా!? ఇక అంతే!. దౌర్జన్యంగా డబ్బు లాగేస్తారు. ఈ ముఠా ఆగడాలు నెల్లూరు జిల్లాలో ఇటీవల పెచ్చుమీరాయి. గతంలో కావలి కేంద్రంగా నడిచిన ఆ ముఠా దందా ఇప్పుడు నెల్లూరు విస్తరించింది. గడిచిన రెండు నెలల కాలంలో నెల్లూరులో వీరి వలలో 10మంది వరకూ పడినట్లు సమాచారం. తిరుపతికి చెందిన డాక్టర్ ఫిర్యాదుతో తాజాగా నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్‌లో ఆ ముఠాపై కేసు నమోదు చేశారు. తిరుపతికి చెందిన ఆ డాక్టర్ ఆ గ్యాంగ్ మీడియేటర్ మాటలు నమ్మి తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డారు. గత నెలలో రూ. 14.50 లక్షలతో నెల్లూరుకు వచ్చి ట్రాప్ గ్యాంగ్‌కు చిక్కారు. ఆ ముఠా సభ్యులు డాక్టర్‌ను ఓ ఇంటిలోకి తీసుకెళ్లి ఆయన తెచ్చిన డబ్బు లాక్కుని బంగారం ఇవ్వకుండా బయటకు గెంటేశారు. ఈ విషయాన్ని సదరు డాక్టర్ నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావుకు చెప్పగా, ఆయన ఓ టీంతో రహస్యంగా ట్రాప్ గ్యాంగ్ ఆగడాలపై విచారణ చేసినట్లు సమాచారం.
పక్కాగా ప్లాన్ చేస్తారు..
నెల్లూరు కొత్తకాలువ సెంటర్ వద్ద ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి, మహిళ భార్యాభర్తలమని చెప్పి రెండు నెలల క్రితం ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరు ట్రాప్ గ్యాంగ్‌లో సభ్యులు. కావలికి చెందిన ఓ వ్యక్తి ఈ గ్యాంగ్‌కు లీడర్ కాగా, వెంకటేశ్వరపురానికి చెందిన బావ, బామ్మర్దులు కీలక సభ్యులు. వీరు మీడియేటర్లను పెట్టుకుని ట్రాప్ చేస్తారు. వలలో పడ్డవాళ్లని ఆ మీడియేటర్లు కొత్త కాలువ సెంటర్‌కు తీసుకురాగానే ఇక మిగిలిన కథంతా గ్యాంగ్ ప్రధాన సభ్యులు చూసుకుంటారు. బంగారం కొనుగోలుకు డబ్బుతో వచ్చిన వారిని అద్దెకు తీసుకున్న ఇంటికి తీసుకెళ్లి భయపెడతారు. ఎదురు తిరిగితే కొడతారు. డబ్బు లాక్కుని బయటకు గెంటేస్తారు. రెండు నెలల నుంచి సుమారు పది మంది వీరి చేతిలో మోసపోయినట్లు, భయంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయనట్లు తెలుస్తోంది. ఈ మోసాల విలువ రూ.కోట్లలోనే ఉంటుందని సమాచారం. గతేడాది ముత్తుకూరు మండలం జెన్‌కో రోడ్డులో ఇదే తరహా ట్రాప్‌లో ఉన్న నిందితులే ఇప్పుడు నెల్లూరులో పాగా వేశారని, గూడూరు, సూళ్లూరుపేటల్లో కూడా వీరి దందాలు నడుస్తున్నాయని తెలుస్తోంది.
ఎఫ్‌ఐఆర్‌లో ‘గ్యాంగ్’ పేర్లెందుకు లేవో?
తాజాగా నమోదైన కేసులో ఓ మీడియేటర్‌తో పా టు వెంకటేశ్వరపురానికి చెందిన వ్యక్తి, ఇంటిని అద్దెకు తీసుకున్న మహిళ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కానీ గ్యాంగ్ ప్రధాన సభ్యులను చేర్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ట్రాప్‌ల్లో కీలకంగా ఉన్న ఒంగోలుకు చెందిన వ్యక్తి నెల్లూరులో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారికి సోదరుడిగా ప్రచా రం జరుగుతోంది. అయితే ఈ ట్రాప్ గ్యాంగ్‌తో పోలీసులకు సంబంధాలున్నట్లు గతేడాది ముత్తుకూరులో నమోదైన కేసులో బయటపడింది. ఈ క్రమంలోనే నెల్లూరు రూ రల్ పోలీసు స్టేషన్‌లో ఐదుగురు సిబ్బందిపై గతేడాది బదిలీ వేటు వేశారు. అయునా కూడా కొందరు పోలీసులు ఈ గ్యాంగ్‌కు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా నమోదైన కేసులో లోతుగా విచారణ జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.