బంగారం మాయ!
ABN , Publish Date - May 18 , 2025 | 01:33 AM
ఇటీవల ఓ మహిళ జైహింద్ కాంప్లెక్స్ హోల్‌సేల్ ఆభరణాల దుకాణంలో సుమారు రూ.5లక్షల విలువ చేసే బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆమె అవసరాల నిమిత్తం ఆ బంగారు ఆభరణాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవటానికి ప్రయత్నించగా, బ్యాంక్ అధికారులు రూ.3 లక్షలకు మించి రుణం ఇవ్వటం కుదరదని చెప్పటంతో ఆమె షాక్‌కు గురైంది.
-హోల్‌సేల్ పేరుతో కస్టమర్లకు ఎర
-జీఎస్టీ, తక్కువ తరుగు అంటూ అమ్మకాలు
-రంగు రాళ్లు, బంగారం కలిపి బరువు లెక్కిస్తూ ధర వసూలు
-బ్యాంకులో రుణం కోసం ఓ మహిళ వెళ్తే బయటపడ్డ అసలు విషయం
- పోలీసులను ఆశ్రయిస్తే.. రాజీకి వచ్చిన వ్యాపారి!
వన్‌టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి):
బంగారం అమ్మకాల్లో వ్యాపారులు రకరకాల లెక్కలు చెప్పి ఆభరణాలకు ధరలు నిర్ణయిస్తుంటారు. వీటి హేతబద్ధత గురించి సరైన వివరాలు మాత్రం ఉండవు. కార్పొరేట్ షోరూమ్‌ల్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే తరుగు, మజూరి, జీఎస్టీ పేరుతో కొంత అదనంగా చెల్లించవలసి వస్తుంది. ఈ క్రమంలో విజయవాడ హోల్‌సేల్ మార్కెట్‌లో కొత్త దందా నడుస్తోంది. బంగారు ఆభరణాల విక్రయాల్లో విజయవాడ, వన్‌టౌన్, గవర్నర్‌పేట మార్కెట్‌లో తెలుగు రాష్ర్టాల్లో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా గవర్నర్‌పేట జైహింద్ మార్కెట్‌లోని బంగారు దుకాణాలలో బంగారు ఆభరణాలు అత్యధికంగా విక్రయిస్తుంటారు. షోరూమ్‌లలో ఉండే డిజైన్లు కంటే పదుల సంఖ్యలో ఎక్కువగా ఆభరణాలు ఇక్కడ లభిస్తున్నాయి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలతో పాటు ఆభరణాలపై పెట్టుబడి పెట్టేవారు హోల్‌సేల్ బంగారు ఆభరణాల దుకాణాలలో నగలను కొనుగోలు చేస్తుంటారు. ఈ దుకాణాలలో ప్రతిరోజూ కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి.
అప్రమత్తంగా లేకపోతే అంతే..
ఇటీవల ఓ మహిళ జైహింద్ కాంప్లెక్స్ హోల్‌సేల్ ఆభరణాల దుకాణంలో సుమారు రూ.5లక్షల విలువ చేసే బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆమె అవసరాల నిమిత్తం ఆ బంగారు ఆభరణాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవటానికి ప్రయత్నించగా, బ్యాంక్ అధికారులు రూ.3 లక్షలకు మించి రుణం ఇవ్వటం కుదరదని చెప్పటంతో ఆమె షాక్‌కు గురైంది. దీంతో ఆమె బంగారాన్ని కొనుగోలు చేసిన దుకాణాదారుడి వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే ఆభరణాల్లో రాళ్ల బరువు మినహాయిస్తే, బంగారం బరువు అంతే ఉంటుందని సదరు వ్యాపారి చెప్పాడు. 52 గ్రాముల బరువు ఉన్న ఆభరణానికి రూ.4.94 లక్షలు ధర నిర్ణయించగా, మహిళకు రూ.4.70 లక్షలకు విక్రయించారు. ఆభరణాన్ని విక్రయించేటప్పుడు రూ.52.5 గ్రాముల బరువుకు రూ.9వేలు చొప్పున ధర వసూలు చేశారు. బ్యాంకులో ఆభరణం విలువను లెక్కించేటప్పుడు ఆభరణంలో సుమారు 13 గ్రాముల రాళ్ల బరువు ఉన్నట్లు అప్రైజర్ తేల్చాడు. బంగారు ఆభరణంలో ఉన్న 9 పెద్ద పూసలు ఒక్కొక్కటి 0.750 మిల్లీ గ్రాములు, మిగిలిన రాళ్లు కలిపి 12 నుంచి 13 గ్రాముల బరువు ఉంటాయని, ఆభరణం బరువు 38 గ్రాముల లోపు ఉంటుందని లెక్కించాడు. ఈ వ్యవహారంలో 13 గ్రాముల రాళ్ల బరువుకు కూడా రూ.9వేల చొప్పున బంగారం ధరను వసూలు చేసిన దుకాణదారుడు వారికి జీఎస్టీ రూపంలో లాభం వచ్చినట్లు నమ్మించాడు. తరుగు 2 శాతంలోపే తీసుకున్నానని చెప్పాడు. కొనుగోలు చేసిన బంగారం ఆభరణం అసలు బరువు లెక్క మాత్రం చెప్పలేదు. బ్యాంక్ లెక్కల్లో 38 గ్రాముల మాత్రమే బరువు తేలటంతో హోల్‌సేల్ లెక్క తేల్చాలని బాధితురాలు దుకాణం యజమానిని నిలదీశారు.
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
బంగారు ఆభరణాల తయారీలో తరుగు 18 శాతం వరకు ఉంటుందని, మేకింగ్ చార్జీలు, డిజైనింగ్ చార్జీలు, జీఎస్టీతో పాటు రాళ్ల బరువు క్యారెట్లలో లెక్కించిన తాము హోల్‌సేల్‌గా విక్రయించిన ధర కంటే ఎక్కువే అవుతుందని దుకాణదారుడు బాధితురాలిని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆభరణాలలో రాళ్ల బరువును విడిగా లెక్కిస్తారని, సాధారణ రంగురాళ్లకు బరువుతో సమానంగా ధర వసూలు చేయరని ప్రముఖ వ్యాపారస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నిరాకరించటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.
గుట్టుచప్పుడు కాకుండా సెటిల్‌మెంట్
రాళ్ల బరువుతో కలిపి ఆభరణం విలువను లెక్కించటం, హోల్‌సేల్ పేరుతో ఆభరణంలో బంగారం బరువును లెక్కలో చూపకుండా రాళ్ల బరువుతో కలిపి మొత్తం బరువును లెక్కించటంపై పోలీసులు దుకాణదారుడిని ప్రశ్నించారు. దీంతో దుకాణదారుడు బాధితురాలు కొనుగోలు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తానని పోలీసులకు చెప్పటంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం ముగిసినట్లు తెలిసింది. రోజూ కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపే పలువురు వ్యాపారస్తులు జీఎస్టీలు, బిల్లులు లేకుండా ఆభరణాల విక్రయాలు యథేచ్ఛగా జరగటం సందేహాలకు తావిస్తోంది. లీగల్ మెట్రాలజీ, కమర్షియల్ ట్యాక్స్ శాఖ అధికారులకు తెలిసే విజయవాడలో బంగారం జీరో వ్యాపారం ప్రతిరోజూ కోట్లలో జరుగుతుందని పలువురు వ్యాపారస్తులే బహిరంగంగా చెబుతున్నారు. సాధారణ రంగు రాళ్లకు బంగారంతో సమానంగా ధర వసూలు చేయటం, అదే ఆభరణం బరువుగా నిర్ధారిస్తూ వాటికి సర్టిఫికెట్లను ఇవ్వటం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.