Chodavaram: తాకట్టు బంగారంలో చిలక్కొట్టుడు
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:58 AM
ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారపు వస్తువుల్లో బాంకు సిబ్బంది చిలక్కొట్టుడు కొట్టిన విషయం అనకాపల్లి జిల్లా చోడవరంలోని ‘ది కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకు’లో బయటపడింది.
చోడవరం కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకులో ఘరానా మోసం
చోడవరం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారపు వస్తువుల్లో బాంకు సిబ్బంది చిలక్కొట్టుడు కొట్టిన విషయం అనకాపల్లి జిల్లా చోడవరంలోని ‘ది కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకు’లో బయటపడింది. పట్టణానికి చెందిన వెలుగుల దొరబాబు తన భార్యకు చెందిన 60 గ్రాముల బరువు గల రెండు బంగారు నెక్లెస్‌లను కనకమహాలక్ష్మి బ్యాంకులో తాకట్టు పెట్టారు. రెండు రోజుల క్రితం బ్యాంకు నుంచి విడిపించుకున్నారు. ఆ వస్తువుల్లో చిన్నచిన్న ముక్కలు తొలగించి ఉండడాన్ని గమనించి.. స్థానిక నాయకుడు జయదేవ్ సహకారంతో బ్యాంకు అధికారులను గట్టిగా నిలదీశారు. తప్పిదాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు, రెండు వస్తువుల్లో తగ్గిన రెండు గ్రాముల బంగారాన్ని ఆయనకు గురువారం తిరిగి ఇచ్చారు. అలాగే, ఓ మాజీ ప్రజా ప్రతినిధి సోదరుడు తాకట్టు పెట్టిన వస్తువులో కూడా కొంతమేర తగ్గడంతో, అధికారులను నిలదీయగా తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బంది అంగీకరించారు. ప్రస్తుతానికి ఇలా ఎనిమిది మంది ఖాతాదారులు మోసపోయినట్టు తేలింది. ఈ బ్యాంకులో బంగారం తనిఖీ చేసే అప్రైజర్ వెంకటేశ్, గతంలో పనిచేసిన బ్యాంకు అధికారి, కొందరు సిబ్బందితో కలిసి ఈ మోసానికి పాల్పడినట్టు చెబుతున్నారు. అయితే అప్రైజర్‌పై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా, అతడిని ఇక్కడి నుంచి బదిలీ చేసి చేతులు దులుపుకోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.