Share News

Goldsmith Employment: మంగళగిరికి కొత్త మెరుపు

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:31 AM

రాజధాని ప్రాంతంలోని మంగళగిరి మరోసారి తళుక్కున మెరవనుంది. సుమారు 78 ఎకరాల విస్తీర్ణంలో 20వేల మందికిపైగా ఉపాధి కల్పించేవిధంగా మంగళగిరిలోని ఆత్మకూరులో గోల్డ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కానుంది.

Goldsmith Employment: మంగళగిరికి కొత్త మెరుపు

  • 78 ఎకరాల్లో గోల్డ్‌ క్లస్టర్‌ ఏర్పాటు

  • స్వర్ణకారులకు ఇక శాశ్వత ఉపాధి

  • ఎన్నికల్లో హామీ ఇచ్చిన నారా లోకేశ్‌

  • అన్నట్టే రూ.ఐదు కోట్లతో సర్కారు శ్రీకారం

  • 20వేలమందికి ఉపాధి.. లక్ష్యం

(మంగళగిరి - ఆంధ్రజ్యోతి)

రాజధాని ప్రాంతంలోని మంగళగిరి మరోసారి తళుక్కున మెరవనుంది. సుమారు 78 ఎకరాల విస్తీర్ణంలో 20వేల మందికిపైగా ఉపాధి కల్పించేవిధంగా మంగళగిరిలోని ఆత్మకూరులో గోల్డ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కానుంది. రూ.ఐదు కోట్లతో దీనికి రూపకల్పన చేయాలని సోమవారం సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన సీఆర్డీయే 51వ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలో చేనేత తరువాత ఎక్కువమంది స్వర్ణకారవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు ఎనిమిదివేలమంది ఈ వృత్తిలో ఉన్నారని అంచనా! ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక శాసనసభ్యుడు...ఐటీ మంత్రి నారా లోకేశ్‌ తొలిసారిగా గోల్డ్‌ క్లస్టర్‌ ఆలోచనను తెరపైకి తెచ్చారు. కూటమిని గెలిపిస్తే మంగళగిరిలో అతి భారీస్థాయిలో దీనిని ఏర్పాటుచేస్తామని హమీ ఇచ్చారు. మంగళగిరిని చేనేతకు, బంగారు వ్యాపారానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద కేంద్రంగా మలచాలన్న పట్టుదలను ఆయన ప్రదర్శించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ ప్రధాన సంచికలో ‘మంగళగిరిలో మినీ దుబాయ్‌’ పేరిట ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అప్పట్లో ఈ కథనం రాష్ట్రంలో ఓ హట్‌ టాపిక్‌గా మారింది. నేడది కార్యరూపాన్ని దాల్చబోతుంది. మంగళగిరిలోని తెనాలిరోడ్డు వెంబడి అక్షయపాత్ర భవనసముదాయానికి దక్షిణంగా ఆత్మకూరు ప్రాంత పరిధిలో సర్వేనంబర్లు 133, 134, 135, 136లలో ఉన్న ప్రభుత్వ ఖాళీ, అసైన్డ్‌ భూముల్లో గోల్డ్‌ క్లస్టర్‌లో భాగంగా జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్కు రానుంది.


స్వర్ణకారులకు స్వర్గమే..

దేశంలో నవీముంబైతోపాటు కోల్‌కతా, సూరత్‌, కోయంబత్తూరు వంటి నగరాల్లో జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్కులు ఉన్నాయి. వీటిలో ముంబైలోని పార్కు వ్యాపారరీత్యా అతిపెద్ద వాణిజ్యకేంద్రం.దానికి దీటుగా మంగళగిరిలోనూ ఈ పార్కు ఏర్పాటుచేసేలా ప్రతిపక్షంలో ఉండగానే..నారా లోకేశ్‌ స్పష్టమైన ప్రణాళికను రూపొందించారు.మంగళగిరి ప్రాంత స్వర్ణకారులకు చేతినిండా పని ఉండేలా చేయడంతోపాటు ఆర్థికంగా వారంతా మంచి ఉచ్ఛస్థితికి చేరుకునేందుకు చర్యలు చేపట్టాలని తలిచారు. అధికారం చేతికొచ్చిన తొలిరోజునుంచే కార్యచరణను లోకేశ్‌ ఆరంభించారు.ఈ పార్కుకోసం స్వర్ణకారులను సిద్దంచేసే పనిని లోకేశ్‌ తన భుజాలకు ఎత్తుకున్నారు.అయిదంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని సొంత ఖర్చులతో ఎల్‌ఎన్‌ గోల్డ్‌స్మిత్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు.ఆ సంస్థ ఆధ్వర్యంలో మంగళగిరి పరిధిలోని స్వర్ణకారులందరికీ ఆధునిక డిజైన్ల తయారీపై శిక్షణ ఇప్పించనున్నారు.ఈ ఫౌండేషన్‌లో 77మంది సభ్యులు ఉండగా, 670 మంది స్వర్ణకారులకు ఇక్కడ ఆధునిక మోడళ్లలో ఆభరణాల తయారీకి శిక్షణ అందించనున్నారు.ఇక..జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ పార్కులో రత్నాలు, బంగారంతో కూడిన ఆభరణాలను అత్యంత నైఫుణ్యంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో తయారుచేస్తారు.

Updated Date - Aug 19 , 2025 | 05:33 AM