Proddatur: బంగారంలో బిస్కెట్లదే జోరు
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:30 AM
ఆభరణాల రూపంలోనే బంగారం కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ పుత్తడి ధరలు ఆశాన్నంటుతున్న తరుణంలో ట్రెండ్ మారింది. పసిడి పురిగా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో...
ప్రొద్దుటూరులో భారీగా పెరిగిన అమ్మకాలు
రోజుకు 10 కేజీల వరకూ సాగిన విక్రయాలు
తగ్గిన ఆభరణాల కొనుగోళ్లు.. బిస్కెట్లపైనే మోజు
రేటు ఇంకా పెరుగుతుందనే అంచనాతో పెట్టుబడి
(ప్రొద్దుటూరు, ఆంధ్రజ్యోతి)
ఆభరణాల రూపంలోనే బంగారం కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ పుత్తడి ధరలు ఆశాన్నంటుతున్న తరుణంలో ట్రెండ్ మారింది. పసిడి పురిగా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారు బిస్కెట్ల వ్యాపారం జోరుగా సాగింది. ఆగస్టు 1న పది గ్రాముల బంగారం రూ. లక్షకు చేరుకోగానే ప్రజలు కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. అక్టోబరు 20 దీపావళి వరకు గోల్డ్ రేట్ అనూహ్యంగా పెరిగింది. ఈ సమయంలో ప్రతి రోజు ప్రొద్దుటూరు మార్కెట్‌లో 5 నుంచి 10 కిలోల వరకు బంగారు బిస్కెట్ల కొనుగోళ్లు జరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్‌లో కేవలం ఈ బిస్కెట్ల టర్నోవరే రోజుకు రూ. 25 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మేర ఉంటుందని బులియన్ వర్గాల సమాచారం. ఒకపక్క బంగారం రేటు పెరుగుతుండటంతో పాటు.. మరోపక్క రియల్ ఎస్టేట్ రంగం మందగించడం కూడా ఇక్కడి వ్యాపారులకు కలసివచ్చింది. ప్రొద్దుటూరులో ఎక్కువ మంది వ్యాపారులు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయం ఎక్కువగా ఉన్న వారు బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేశారని చెబుతున్నారు.
ఆభరణాల వెలవెల
ఆభరణాల తయారీ, కొనుగోళ్లకు కస్టమర్లు ముందుకు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. గత రెండు నెలలుగా గోల్డ్ మార్కెట్ మొత్తంలో ఆభరణాల అమ్మకాలు 30 నుంచి 40 శాతం మాత్రమే ఉంటే, బిస్కెట్ల అమ్మకాలు మాత్రం 50 నుంచి 60 శాతం ఉందని వెల్లడించారు. ఇంట్లో శుభకార్యాలున్న వారు తప్పని పరిస్థితుల్లో ఆభరణాల కొనుగోలు, తయారీకి మొగ్గుచూపారన్నారు. బంగారంతో పాటు వెండి రేటు కూడా చుక్కలనంటింది. దీంతో చాలామంది వెండి దిమ్మెలు పెద్దఎత్తున కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది. కిలో వెండి ధర చెన్నైలో సుమారు పది వేలు ఎక్కువగా ఉండటంతో ప్రొద్దుటూరు నుంచి పెద్ద ఎత్తున చెన్నైకి వెండిని తరలించినట్లు చెబుతున్నారు.
తిరిగి అమ్మేందుకు వస్తున్నారు
ప్యూర్ గోల్డ్, ప్యూర్ సిల్వర్ వ్యాపారం తప్ప ఆభరణాల వ్యాపారం బాగా తగ్గిపోయింది. దీపావళి నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 10 గ్రాముల ధర లక్ష లోపునకు వచ్చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రూ. 1.32 లక్షల నుంచి రూ. 1.23 లక్షలకు తగ్గడంతో బిస్కెట్లు అమ్మడానికి కొందరు మార్కెట్‌కు తీసుకొస్తు న్నారు. కానీ మార్కెట్‌లో మాత్రం తక్కువకు అడుగుతున్నారు.
- బుశెట్టి రామ్మోహన్, గోల్డ్ డైమండ్ సిల్వర్ మర్చంట్ అసోసియేషన్, ప్రొద్దుటూరు