Share News

Gold Bag Theft: రైలులో నగల బ్యాగ్‌ చోరీ.. ఆపై డ్రెస్‌ మార్చి పరారీ..

ABN , Publish Date - Nov 28 , 2025 | 06:03 AM

ముఖానికి మాస్క్‌, తలకు టోపీ.. నెక్‌ టీ షర్ట్‌ వేసుకున్న ఓ వ్యక్తి హైదరాబాద్‌లో రైలెక్కాడు. ఆ తర్వాత టోపీ తీసేసి ఏ3 కోచ్‌లో కలియ తిరిగాడు....

Gold Bag Theft: రైలులో నగల బ్యాగ్‌ చోరీ.. ఆపై డ్రెస్‌ మార్చి పరారీ..

  • సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు.. నిందితుడిని పట్టిచ్చిన ర్యాపిడో బైక్‌

  • విజయవాడలో బంగారం అమ్ముతుండగా అరెస్ట్‌

ఒంగోలు క్రైం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ముఖానికి మాస్క్‌, తలకు టోపీ.. నెక్‌ టీ షర్ట్‌ వేసుకున్న ఓ వ్యక్తి హైదరాబాద్‌లో రైలెక్కాడు. ఆ తర్వాత టోపీ తీసేసి ఏ3 కోచ్‌లో కలియ తిరిగాడు. అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులు నిద్రిస్తుండగా.. రూ.48 లక్షల విలువైన బంగారు నగలతో కూడిన బ్యాగును కాజేశారు. ఆ తర్వాత పూర్తిగా డ్రెస్‌ మార్చి.. ప్యాంట్‌, షర్ట్‌ ధరించి నెల్లూరులో దిగిపోయాడు. సినీ ఫక్కీలో అంతా ప్లాన్‌ ప్రకారమే చేసినప్పటికీ.. ర్యాపిడో బైక్‌ ఆ దొంగను పట్టించింది. ఈ నెల 13న చార్మినార్‌ ఎక్స్‌ప్రె్‌సలో జరిగిన దొంగతనం కేసులో రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.48.10 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక రైల్వే పోలీసుస్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో నెల్లూరు రైల్వే డీఎస్పీ జీ.మురళీధర్‌ ఆ వివరాలు తెలియజేశారు. .

దొంగను పట్టించిన ర్యాపిడో బైక్‌

చార్మినార్‌ ఎక్స్‌ప్రె్‌సలో చోరీపై రైల్వే డీఐజీ సత్య ఏసుబాబు నేతృత్వంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ ఆదేశాల మేరకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈనెల 13న రాత్రి హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌కు ర్యాపిడో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అనుమానించారు. అతను ఎవరు అని ఆరా తీయగా బాలాపూర్‌కు చెందిన మహ్మద్‌ షకీల్‌గా గుర్తించారు. అతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు విజయవాడలో బంగారం అమ్ముతుండగా గురువారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లలో దొంగతనాలు చేసే మహ్మద్‌ షకీల్‌ ఈ నెల 13న తన ఇంటి దగ్గర నుంచి నాంపల్లి స్టేషన్‌ వరకు ర్యాపిడో బైక్‌ బుక్‌ చేసుకున్నాడు. హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వెళ్లేందుకు టికెట్‌ కొనుగోలు చేశాడు. మాస్కు ధరించి, తలకు టోపీ పెట్టుకుని స్టేషన్‌లోకి ప్రవేశించిన షకీల్‌ ఆ సమయంలో నెక్‌ టీషర్ట్‌తో ఉన్నాడు. బండి ఎక్కిన తర్వాత టోపీ తీసేసి తిరిగాడు. ఏ3 కోచ్‌లో బ్యాగ్‌ దొంగిలించిన తర్వాత పూర్తిగా డ్రెస్‌ మార్చి షర్ట్‌, ప్యాంట్‌ వేసుకున్నాడు. మాస్క్‌ తీసేసి.. టోపీ పెట్టుకున్నాడు. ఆ తర్వాత నెల్లూరులో రైలు దిగాడు. అక్కడ నుంచి విజయవాడ వరకు రైలులో ప్రయాణం చేసి, హైదరాబాద్‌కు బస్సులో వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా రైల్వే పోలీసులు గుర్తించారు.

Updated Date - Nov 28 , 2025 | 06:03 AM