Golconda Group Donation: చిరుమామిళ్లలో 30 పడకల సీహెచ్‌సీ
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:10 AM
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని..
రూ.5 కోట్ల విరాళం ఇచ్చేందుకు ‘గోల్కొండ’ గ్రూప్స్ అధినేత రామిరెడ్డి అంగీకారం
నాదెండ్ల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(కమ్యూనిటీ హెల్త్ సెంటర్) నిర్మించనున్నారు. ఈ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి గోల్కొండ గ్రూపు సంస్థల అధినేత, చిరుమామిళ్ల గ్రామస్థుడు నడికట్టు రామిరెడ్డి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదేశాల మేరకు ఏపీఎంఎ్‌సఐడీసీ ఈఈ నాయక్‌తో పాటు అధికారులు, రామిరెడ్డి నిర్మాణ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. 2013లో సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని ఆస్పత్రి నిర్మాణానికి రామిరెడ్డి విరాళంగా అందజేశారు. ఈ క్రమంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.6 కోట్ల అంచనా వేయగా రూ.4.5 కోట్లకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. రామిరెడ్డి ఇవ్వనున్న రూ.5 కోట్ల విరాళంతో ఆరోగ్య కేంద్రంపై అదనపు ఫ్లోర్, కాంపౌండ్ వాల్ నిర్మించనున్నారు. కాగా.. గ్రామీణ పేదలతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆరోగ్య కేంద్రం ఎంతో ఉపయోగ పడుతుందని రామిరెడ్డి తెలిపారు.