దేవుడి ఆస్తులకు శఠగోపం!
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:16 AM
మచిలీపట్నంలో ప్రసిద్ధి చెందిన రంగనాయక స్వామి ఆలయ భూములను తక్కువ ధరకు మాజీ మంత్రి పేర్ని నాని కొట్టేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేవదాయశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆలయ భూములను వేలం వేయించారని సమాచారం. ఆ తర్వాత తక్కువ ధరకు తన కుటుంబ సభ్యులు, అనుయాయుల కొనుగోలు చేయించారని తెలిసింది. దీనిపై ఆధారాలు సేకరించిన టీడీపీ నాయకులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.
- 2007లో రంగనాయక స్వామి ఆలయ భూముల వేలం
- మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబసభ్యులు, అనుయాయుల కొనుగోలు
- పుష్కలంగా ఆదాయం ఉన్నా భూములు వేలం వేయడంపై టీడీపీ నేతల ఆరా
- అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేర్ని నాని చేసిన బాగోతం వెలుగులోకి..
- ఈ భూములపై న్యాయపోరాటానికి టీడీపీ నాయకులు సిద్ధం
మచిలీపట్నంలో ప్రసిద్ధి చెందిన రంగనాయక స్వామి ఆలయ భూములను తక్కువ ధరకు మాజీ మంత్రి పేర్ని నాని కొట్టేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేవదాయశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆలయ భూములను వేలం వేయించారని సమాచారం. ఆ తర్వాత తక్కువ ధరకు తన కుటుంబ సభ్యులు, అనుయాయుల కొనుగోలు చేయించారని తెలిసింది. దీనిపై ఆధారాలు సేకరించిన టీడీపీ నాయకులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
మచిలీపట్నం నగరం నడిబొడ్డున రంగానాయక స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఆవరణలో ప్రధాన రహదారి వెంబడి 100కుపైగా వివిధ రకాల షాపులు ఉన్నాయి. వీటిపై వచ్చే ఆదాయంతో ఆలయాన్ని ఎలాంటి ఆర్థికపరమైన లోటుపాట్లు లేకుండా నడిపే వెసులుబాటు ఉంది. ఇదిలా ఉంటే, ఈ ఆలయానికి మచిలీపట్నం శివారులో 216 జాతీయ రహదారికి దగ్గరలో బైపాస్ రహదారి రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో సర్వే నెంబరు 197లో 5.33 ఎకరాల భూమి ఉంది. 2004లో మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికైన పేర్ని నాని అత్యంత విలువైన ఈ భూమిపై కన్నేశాడు. అప్పటి దేవదాయ, ధర్మదాయశాఖ అధికారులపై ఒత్తిడితెచ్చి ఈ భూములను వేలం వేసేలా వ్యూహం రచించాడు. ఆలయానికి చెందిన ఈ భూమిలో హైటెన్షన్ విద్యుత వైర్లు ఉన్నాయని, ఈ భూములను ఎవ్వరూ కొనుగోలు చేయరనే ప్రచారం తెరపైకి తెచ్చాడు. దీంతో ఈ భూముల వేలంలో పాల్గొనేందుకు ఎవ్వరు రాకుండా తెరవెనుక చక్రం తిప్పాడు. 2007లో భూములను వేలం వేసేందుకు పూర్తి స్థాయి అనుమతులు తెచ్చి గజం భూమిని వెయ్యి రూపాయలు, రూ.1200లకు తన అనుయాయులతో కొనుగోలు చేయించాడు. కొంతకాలం తర్వాత ఈ భూమిలో ఉన్న హైటెన్షన్ విద్యుత స్తంభాలు, వైర్లను ఎలాంటి రుసుము కట్టకుండా తొలగించి, ఈ భూమి ధర పెరిగేలా చర్యలు తీసుకున్నాడు.
టీడీపీ నాయకుల ఆరోపణలు ఇవీ
మాజీ మంత్రి పేర్ని నాని 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రంగనాయక స్వామి ఆలయ భూములను కారు చౌకగా తన అనునయులతో కొనుగోలు చేయించడం, ఆ తర్వాత తన బంధువుల పేరుతో ఈ భూములను రిజిస్ర్టేషన్ చేయించడానికి సంబంధించిన అన్ని ఆధారాలను టీడీపీ నాయకులు ఐ.దిలీప్‌కుమార్, గొర్రెపాటి గోపిచంద్, పిప్పళ్ల కాంతారావు, పీవీ ఫణికుమార్ సేకరించారు. దీనిపై ఆదివారం శిడింబి అగ్రహారంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచవరం వద్ద బైపాస్ రోడ్డు వెంబడి రంగ నాయక స్వామి ఆలయానికి 5.33 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఈ భూమిని ఎం.వీరవెంకట సుబ్బారావు తదితరుల పేరుతో డాక్యుమెంట్ నెంబరు 6851/2012తో 1.33 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా చూపారని చెప్పారు. డాక్యుమెంట్ నెంబరు 5269/2012తో ఎల్.వెంకటరమణమూర్తి పేరుతో రెండు ఎకరాలు, డాక్యుమెంట్ నెంబరు 5060/2011తో ఎస్.మధుసూదనరావు తదితరుల పేరుతో రెండు ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా చూపారని తెలిపారు. పేర్ని నాని తన అనుయాయులతో ఈ భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయించిన మాట వాస్తవం కాదా అని వారు ప్రశ్నించారు. ఈ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేయించి కొంత కాలం పాటు అలానే ఉంచారని తెలిపారు. పేర్ని నాని 2019లో మంత్రి పదవి చేపట్టిన తర్వాత తన కుటుంబ సభ్యుల పేరున భూములను రిజిస్ర్టేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. సర్వే నెంబరు 197లోని భూమిని డాక్యుమెంట్ నెంబరు 2627/2023తో పేర్ని జయసుధ పేరున, పేర్ని నాని మామ అయిన పట్టపు రామచంద్రరావు పేరున డాక్యుమెంట్ నెంబరు 12252/2022తో 250 గజాల చొప్పున స్థలాన్ని రిజిస్ర్టేషన్ కూడా చేయించుకున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా వారు చూపారు. కూటమి ప్రభుత్వంలో ఆలయ ఆస్తులను కాజేస్తున్నారని ఇటీవల ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని రంగనాయక స్వామి ఆలయ భూములను కాజేయడంపై ఏం సమాధానం చెబుతారని వారు ప్రశ్నించారు. రంగనాయక స్వామి ఆలయ భూములను అధికారాన్ని ఉపయోగించుకుని అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసిన పేర్ని నాని, ఆయన అనుచరులు ఈ భూములను తిరిగి ఆలయానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.