PVN Madhav: గోదావరి జలాలతో సీమ సస్యశ్యామలం
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:35 AM
రాయలసీమకు గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
ప్రాంతాలకు అతీతంగా ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారు
బీఆర్‌ఎస్ కాస్తా వీఆర్‌ఎస్ పార్టీగా మారింది: మాధవ్
నంద్యాల, జూలై 28(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. సోమవారం ఆయన నంద్యాల జిల్లాలో పర్యటించారు. ముందుగా ఆయన బీజేపీ శ్రేణులతో నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామ స్థాయినుంచి బీజేపీని బలోపేతం చేసేందుకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాయలసీమ ప్రాజెక్టులపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. కృష్ణా, గోదావరి మిగులు జలాలను సీమకు తెచ్చే విధంగా కృషి చేస్తోంది. సీమలోని ప్రాజెక్టులు, ప్రాంత సంస్కృతికి పునర్వైభవం తెస్తాం. నీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు తేవడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. కృష్ణా, గోదావరి మిగులు జలాల అంశాన్ని పరిష్కరించే దిశగా కేంద్రం కృషి చేస్తోంది. అమరావతితో పాటు పోలవరం కూడా ఈ ఐదేళ్లలోపు పూర్తి అవుతుంది. సీమకు వాటా హక్కు ప్రకారం నీరందించి రాయలసీమను రతనాల సీమగా మార్చడం, కర్నూలు డిక్లరేషన్, త్రిమెన్ జడ్జి, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాలపై ఎన్డీయే ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేస్తాం. ఇందుకోసం యువత బీజేపీలో కీలక పాత్ర పోషించాలి’ అని మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ... ‘ఏం చేయాలో అర్థం కాక ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్ కాస్తా ఇప్పుడు వీఆర్‌ఎస్ పార్టీగా మారిపోయింది. ప్రాభవం కోల్పోయిన ఆ పార్టీ ఇప్పుడు ఏపీ వ్యవహారాల్లో తలదూర్చి ఇక్కడి వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది’ అని మాధవ్ ఆరోపించారు.