Flood Precautions: గోదావరిపై పంటు రాకపోకలు నిలిపివేత
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:52 AM
మొంథా తుఫాన్ హెచ్చరికలతో పశ్చిమగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించింది. తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించేందుకు...
భీమవరం టౌన్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ హెచ్చరికలతో పశ్చిమగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించింది. తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించేందుకు జిల్లా అధికారులకు ఒక్కో నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. నరసాపురం వద్ద గోదావరిపై ఉన్న పంటు రాకపోకలను నిలిపివేశారు. పేరుపాలెం బీచ్‌లో సందర్శకులు రాకుండా పర్యాటక కేంద్రాలను మూసి వేశారు. కాల్వలు, ఎటిగట్టు కాల్వలకు గండ్లు పడితే తక్షణమే అడ్డుకట్ట వేసేందుకు నీటి పారుదల శాఖ ఇసుక బస్తాలను సిద్ధం చేసింది. వరి, ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొనడంతో వర్షాలు కురిస్తే తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకు జిల్లా శాస్త్రవేత్తలు సూచనలు చేశారు. నిత్యావసర వస్తువులకు ఆటంకం లేకుండా ముందుగానే రేషన్ షాపులకు చేర వేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.