Share News

Godavari River Swell: ఉధృతంగా గోదావరి

ABN , Publish Date - Sep 16 , 2025 | 03:47 AM

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం సోమవారం అనూహ్యంగా పెరిగింది. ఉపనదులు శబరి, సీలేరు, మంజీర, ప్రవర, ఇంద్రావతి నుంచి భారీగా వచ్చిన..

Godavari River Swell: ఉధృతంగా గోదావరి

  • పట్టిసీమ నుంచి పోలవరం కుడికాలువకు నీటి విడుదల

  • నేడు రాయలసీమలో భారీ వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం సోమవారం అనూహ్యంగా పెరిగింది. ఉపనదులు శబరి, సీలేరు, మంజీర, ప్రవర, ఇంద్రావతి నుంచి భారీగా వచ్చిన వరద కలుస్తుండటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 6,60,977 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్టు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. పోలవరం స్పిల్‌వే ఎగువన 31, దిగువన 22.1, తెలంగాణలోని భద్రాచలం వద్ద 39.50 అడుగులకు నీటిమట్టం పెరిగింది. మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 708 క్యూసెక్కుల జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు పైగా చేరడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఈఈ ఏసుబాబు తెలిపారు.

వాతావరణ అనిశ్చితి..: విదర్భ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కోస్తాలో అనేకచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. నెల్లూరులో 37.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ అనిశ్చితితో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఈనెల 20 లేదా 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసింది. మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, పలు ఇతర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Updated Date - Sep 16 , 2025 | 03:47 AM