Flood Warning: ఉధృతంగానే గోదావరి
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:53 AM
గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీస్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం మరింత పెరిగింది.
పోలవరం నుంచి 10.84 లక్షల క్యూసెక్కులు దిగువకు
ధవళేశ్వరంలో కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
లంక, లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించిన అధికారులు
రాజమహేంద్రవరం/పోలవరం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీస్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం మరింత పెరిగింది. మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 10,84,329 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48.10 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 33.050 మీటర్లు, స్పిల్‌వే దిగువన 24.470 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం అఖండ గోదావరి వద్ద లంక, లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 12.80 అడుగులుగా ఉంది. ఈ నీటిమట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరద నిలకడగా ఉండడంతో ఆ పరిస్థితి రాకపోవచ్చునని పేర్కొన్నారు. మరోవైపు ధవళేశ్వరం నుంచి 11 లక్షల 35 వేల 249 క్యూసెక్కుల మేరకు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ భాగంలోని ఏటూరు నాగారం వద్ద వరద తగ్గుముఖం పట్టగా, కూనవరం, ధవళేశ్వరం వద్ద పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.