Share News

Godavari Flood Update: నిలకడగా గోదావరి

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:22 AM

గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుత సీజన్‌లో మొదటిసారిగా ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ఉధృతంగా ప్రవహించింది.

Godavari Flood Update: నిలకడగా గోదావరి

  • ధవళేశ్వరం వద్ద వరద క్రమంగా తగ్గుముఖం

  • అత్యధికంగా 13,57,119 క్యూసెక్కులు సముద్రంలోకి

  • లంక గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ నీట మునక

  • పోలవరం నుంచి 11.87లక్షల క్యూసెక్కులు విడుదల

  • ముంపు మండలాలను వదలని వరద

ధవళేశ్వరం/వేలేరుపాడు/కుక్కునూరు/పోలవరం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుత సీజన్‌లో మొదటిసారిగా ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ఉధృతంగా ప్రవహించింది. కాటన్‌ బ్యారేజీ వద్ద గురువారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాగా 18 గంటల వ్యవధిలో అర్ధరాత్రి నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ సమయంలో 12,85,832 క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహించింది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటల వరకు క్రమంగా పెరిగిన నీటిమట్టం 14.30 అడుగులకు చేరుకుని నిలకడగా కొనసాగింది. ఈ సమయంలో 13,57,119 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలిపెట్టారు. రాత్రి 7గంటలకు నీటిమట్టం 14.20 అడుగులకు చేరగా 13,48,226 క్యూసెక్కులు దిగువకు ప్రవహిస్తోంది. శనివారం ఉదయం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశం ఉంది.


పడవలపైనే ప్రయాణాలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను వరద ముంచెత్తుతోంది. ఆలమూరు, ముమ్మిడివరం, కె.గంగవరం, పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి తదితర మండలాల్లోని లంక గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ వరదలో మునిగిపోవడంతో పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద ఇటీవల నిర్మించిన కాజ్‌వే గోదావరి వరద ఉధృతికి కొట్టుకుపోయింది.


నిత్యావసరాల కోసం ఇక్కట్లు

అల్లూరి జిల్లాలోని చింతూరు డివిజన్‌లో శబరి, గోదావరి ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 4గంటలకు 50.10 అడుగుల మేర ప్రవహించి, క్రమంగా తగ్గడం మొదలైంది. సాయంత్రం 6గంటలకు 43.90 అడుగులకు చేరుకుంది. చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో నిత్యావసరాల కోసం ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు ఏలూరు జిల్లాలో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరుల్లోని గ్రామాలను వరద వీడడం లేదు. పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 11,87,497 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు.


సుంకేసులకు 1.40 లక్షల క్యూసెక్కులు

తుంగభద్రకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్నూలు నగర శివారులో 1,35,402 క్యూసెక్కులతో ఉధృతంగా ప్రవహిస్తోంది. సుంకేసుల బ్యారేజీకి శుక్రవారం 1.40 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువన శ్రీశైలానికి వదిలేస్తున్నారు. ఇక తుంగభద్ర డ్యాంకు 80,500 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. కాగా, శ్రీశైలం జలాశయానికి 4,73,039 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, స్పిల్‌వే 10 క్రస్ట్‌గేట్లను పైకెత్తి, ఏపీ తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా కలిపి 5,20,111 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Updated Date - Aug 23 , 2025 | 04:25 AM