Share News

Godavari Floods: వరద జలాలతో గోదావరి పరవళ్లు

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:15 AM

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉపనదుల నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు వచ్చి చేరుతుండడంతో పోలవరం వద్ద గోదావరి పరవళ్లు తొకుతోంది.

Godavari Floods: వరద జలాలతో గోదావరి పరవళ్లు

  • పోలవరం స్పిల్‌వే నుంచి 1,68,729 క్యూసెక్కులు విడుదల

  • తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు కళకళ

పోలవరం, కర్నూలు, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉపనదుల నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు వచ్చి చేరుతుండడంతో పోలవరం వద్ద గోదావరి పరవళ్లు తొకుతోంది. గోదావరి నీటిమట్టం గడచిన మూడు రోజుల్లో అనూహ్యంగా పెరిగింది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి అదనంగా వస్తున్న 1,68,729 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారని శుక్రవారం జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 27.760 మీటర్లు, దిగువన 18.330 మీటర్లు, కాఫర్‌ డ్యామ్‌కు ఎగువన 27.900 మీటర్లు, దిగువన 17.080 మీటర్లు, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య 16.120 మీటర్లు నీటిమట్టం నమోదైంది. 902 హిల్‌ ప్రాంతం నుంచి స్పిల్‌ చానల్‌ మీదుగా దిగువ కాఫర్‌ డ్యామ్‌కు వేసిన రోడ్డు మార్గం పూర్తిగా నీటమునగడంతో మట్టి, రాతి తరలింపు లారీలు స్పిల్వే మీదుగా ప్రయాణిస్తున్నాయి. కాగా, పట్టిసీమ నుంచి 708 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశామని ఈఈ యేసుబాబు తెలిపారు.

62,610 క్యూసెక్కులు విడుదల

మహారాష్ట్ర,కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు కళకళలాడుతున్నాయి. తుంగభద్ర డ్యామ్‌లో శుక్రవారం సాయంత్రం 6గంటలకు 75,612 టీఎంసీలు చేరాయి. 74,555 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 21 గేట్లు రెండున్నర అడుగులు ఎత్తి 59,002 క్యూసెక్కులను, విద్యుత్‌ఉత్పత్తి ద్వారా 3,610 క్యూసెక్కులు కలిపి..మొత్తం 62,612 క్యూసెక్కులు వదిలారు. శ్రీశైలం జలాశయానికి సాయంత్రం 7గంటలకు 1,09,777క్యూసెక్కులమేర వరదవచ్చి చేరింది. డ్యామ్‌ గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 876.30 అడుగుల లెవల్‌లో 169.86 టీఎంసీల నిల్వ ఉంది.

Updated Date - Jul 05 , 2025 | 04:16 AM