Godavari Floods: ఉధృతంగా గోదారి
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:59 AM
వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ప్రాణహిత నీరు గోదావరిలో కలుస్తుండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతూ 37.2 అడుగులకు చేరుకుంది.
కుక్కునూరు, వేలేరుపాడుల్లో కాజ్‌వేల మునక..
14 గ్రామాలకు రాకపోకలు బంద్
నిర్వాసితుల కాలనీలకు తరలివెళుతున్న జనం
ధవళేశ్వరం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేత
3,54,341 క్యూసెక్కులు సముద్రంలోకి
పోలవరం, ధవళేశ్వరం, ఏలూరు, అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ప్రాణహిత నీరు గోదావరిలో కలుస్తుండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతూ 37.2 అడుగులకు చేరుకుంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం సాయంత్రానికి కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం 175గేట్లను ఎత్తి 3,54,341 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 9.70 అడుగులుగా ఉంది. భద్రాచలానికి దిగువన ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో వరద ముంపు తీవ్రత కనిపిస్తోంది. కుక్కునూరు-దాచారం మార్గంలో గుండేటి వాగు కాజ్‌వేపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగు కాజ్‌వేపై వరద పెరుగుతుండ డంతో 14 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. స్థానికులు పునరావాస కాలనీలకు తరలివెళుతు న్నారు. వరదలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారు లను పంపింది. శనివారం తెల్లవారుజామున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాబోతుందని యంత్రాంగమంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మరోవైపు పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో... స్పిల్‌వే నుంచి 5,02,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల సంస్థ
గోదావరికి భారీగా వరద వస్తున్నందున నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇన్‌చార్జి ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. నదిలో ప్రయాణించడం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు దిగడం వంటివి చేయరాదన్నారు. వరద ముంపు బారినపడే అల్లూరి, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అత్యవసర సహాయం కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 112,1070, 18004250101ను సంప్రదించాలన్నారు.
రాష్ట్రంలో వేసవి వాతావరణం
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రంగా ఉంటోంది. పడమర దిశ నుంచి పొడిగాలులు వస్తుండటంతో మధ్యాహ్నం వాతావరణం మరింత వేడిగా మారు తోంది. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 4-6 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరులో 39.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ అనిశ్చితి ఏర్పడి కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షం కురిసింది. వచ్చే 24 గంటల్లో ఎండ కొనసాగుతుందని, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.