Water Level Rise: ప్రమాదకర స్థాయిలో వరద గోదారి
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:13 AM
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల బాగా పెరిగి.. శాంతించిన గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం రాత్రి 7 గంటలకు అక్కడ నీటిమట్టం 47.7 అడుగులకు చేరింది.
భద్రాచలం, ధవళేశ్వరంలలో మొదటి హెచ్చరిక జారీ
వేలేరుపాడులో జలదిగ్బంధంలో 23 గ్రామాలు
భయం గుప్పెట్లో కోనసీమ లంక గ్రామాలు
రాజమహేంద్రవరం/ధవళేశ్వరం/పోలవరం/వేలేరుపాడు/కుక్కునూరు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల బాగా పెరిగి.. శాంతించిన గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం రాత్రి 7 గంటలకు అక్కడ నీటిమట్టం 47.7 అడుగులకు చేరింది. ఇది 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రాత్రి 8:35 గంటలకు నీటి మట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 10 గంటలకు నీటిమట్టం 11.90 అడుగులకు చేరిందని ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. బ్యారేజీ నుంచి రాత్రి 10 గంటల సమయానికి 10,06,819 క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరిలో నీరు అంతకంతకూ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 9,69,595 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. విలీన మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గోదావరి వరద నిలకడగా ఉంది. లోతట్టు ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వేలేరుపాడు మండలంలో 23 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కుక్కునూరు మండలం దాచారం గుండేటివాగు లోలెవల్ బ్రిడ్జి నీట మునిగి ఉండడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతు ండటంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
612 టీఎంసీలు కడలిపాలు!
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వందలాది టీఎంసీల కృష్ణా జలాలు కడలి పాలయ్యాయి. జల వనరుల శాఖ లెక్కల ప్రకారం శనివారానికి 612.05 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలసిపోయాయి. శ్రీశైలం జలాశయంలో 215.81 టీఎంసీలకుగాను 198.36 టీఎంసీలు, పులిచింతలలో 45.77 టీఎంసీలకుగాను 39.22 టీఎంసీల నిల్వ ఉంది.