Godavari Flood Intensity Rises: ఉగ్ర గోదావరి
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:35 AM
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి సుమారు 140 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
పెరిగిన వరద ఉధృతి.. జల దిగ్బంధంలో 140 గ్రామాలు
పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు బంద్
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సముద్రంలోకి 12 లక్షల క్యూసెక్కుల నీరు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల సంస్థ
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి సుమారు 140 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇది ఇంకా పెరుగుతూ రాత్రి 7 గంటలకు 13 అడుగులకు చేరుకుంది. సముద్రంలోకి 12,12,773 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. వరద ఉదృతి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి(13.75 అడుగులు)కి పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో కాళేశ్వరం, పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతోంది. భద్రాచలం వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు మండలంలో 1,222 కుటుంబాలు, వేలేరుపాడు మండలంలో 2,468 కుటుంబాలు ముంపు బారిన పడ్డాయి. ప్రభావిత గ్రామాల్లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పర్యటించారు. అల్లూరి జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లోనూ పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరరామచంద్రపురం మండలంలో 40 గ్రామాలు రెండు రోజులుగా జలదిగ్బంధలోనే ఉన్నాయి. కూనవరం మండలంలోని సుమారు 47 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శబరి ఏరియాలో 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ కూనవరం మండలంలో పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించారు. వరద నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. ఇక కొల్లేరు వరద ఉధృతి గురువారం స్వల్పంగా తగ్గడంతో రహదారులు కొద్దికొద్దిగా ముంపు నుంచి బయటపడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది.
దీంతో ప్రాజెక్టు నుంచి 10,95,616 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 33.100 మీటర్లు, దిగువన 24.630 మీటర్లు నమోదైనట్టు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పడుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణానదిలోనూ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపింది. ప్రకాశం బ్యారేజి గుండా 5.02 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి ప్రవహిస్తోంది. వరద పూర్తిస్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
25న అల్పపీడనం
విశాఖపట్నం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): కోస్తా, రాయలసీమ పరిసరాలు, ఇంకా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేవు. దీంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. సముద్రం నుంచి భూఉపరితలంపైకి తేమగాలులు రాకపోవడంతో గురువారం కోస్తా, రాయలసీమల్లోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల ఎండ తీవ్రంగా ఉంది. కావలిలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 24వ తేదీన ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనుంది. దీని ప్రభావంతో ఈనెల 25న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ ప్రభావంతో ఈనెల 25, 26 తేదీల్లో ఉత్తరకోస్తాలో వర్షా లు కురుస్తాయని తెలిపింది.