Godavari River Overflow: ఉరకలేస్తున్న గోదావరి
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:35 AM
గోదావరి వరద ఉరకలేస్తోంది. శనివారం సాయంత్రం నాటికి భద్రాచలం వద్ద 41.20 అడుగులకు వరదనీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువవుతోంది.
గొమ్ముగూడెం చుట్టూ వరద.. ముంపు మండలాలకు పొంచి ఉన్న ముప్పు
మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో.. భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం
ఏలూరు/పోలవరం, ధవళేశ్వరం, జూలై 12(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద ఉరకలేస్తోంది. శనివారం సాయంత్రం నాటికి భద్రాచలం వద్ద 41.20 అడుగులకు వరదనీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువవుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నిండుకుండను తలపిస్తోంది. ఇప్పటికే రెండు రోజులుగా పోలవరం ప్రాజెక్టు ఎగువన ముంపు మండలాలైన కుక్కునూరు, వే లేరుపాడు మండలాల్లో సుమారు 25 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగులోకి వరదనీరు చేరడంతో ఎగువన ఉన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చుట్టూ వరదనీరు చేరడంతో ఆ గ్రామంలోని 250కు పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. దాచారం పునరావాస కాలనీలో నిరాశ్రయులందరికీ భోజన సౌకర్యం ఏర్పాటుచేశారు. అప్పటికప్పుడు సమీపంలో బోరు తవ్వి తాగునీటిని అందుబాటులోకి తెచ్చారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో రమణ, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు, జడ్పీ సీఈవో శ్రీహరి ముంపు మండలాల్లోనే మకాం వేసి ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గోదావరి వరద మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో సాధ్యమైనంత మేర పునరావాస కేంద్రాలకు తరలి రావాల్సిందిగా శనివారంనాడంతా ఆయా గ్రామాల్లో అధికారులు ప్రజలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
6,98,782 క్యూసెక్కులు విడుదల
పోలవరం వద్ద గోదావరి వరద జలాలు ఉధృతంగా ప్రవహిసున్నాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలోకి చేరుకున్న 6,98,782 క్యూసెక్కుల అదనపు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే ఎగువన 31.200 మీటర్లు, దిగువన 22.360 మీటర్ల నీటిమట్టం నమోదయ్యింది. పట్టిసీమ శివక్షేత్రం చుట్టూ వరద జలాలు చుట్టుముట్టాయి. గోదావరి లంక భూములు నీటమునిగాయి. గండిపోశమ్మ ఆలయం నీటమునగడంతో ఆలయానికి రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
ధవళేశ్వరం వద్ద.. సముద్రంలోకి 5,29,209 క్యూసెక్కులు
ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద 3.5 లక్షల క్యూసెక్కులు సముద్రంలో కలవగా శనివారం సాయంత్రానికి 5,29,209 క్యూసెక్కులు కాటన్ బ్యారేజ్ గేట్ల ద్వారా సముద్రంలోకి వెళుతోంది. ఇక్కడ గోదావరి నీటి మట్టం 10.60 అడుగులకు చేరుకుంది. ఆదివారం నాటికి మరింత పెరిగి సుమారు 7లక్షల క్యూసెక్కులకు పైగా ఎగువ నుంచి రావచ్చని ఫ్లడ్ సెక్షన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎగువన భద్రాచలం వద్ద 41.40 అడుగులకు పెరిగిన నీటి మట్టం ఆపై నిలకడగా కొనసాగి తగ్గుముఖం పట్టింది. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు ఒక పాయింట్ తగ్గి 41.30 అడుగులకు చేరుకుంది.
నేటి నుంచి వరద తగ్గుముఖం: విపత్తుల సంస్థ
సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా ప్రకారం గోదావరి వరద ఆదివారం నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అయినా పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల కోసం కోనసీమలో ఒకటి, వేలేరుపాడు, కుక్కునూరులో ఒక్కొక్క ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి గోదావరి వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నదీ పరీవాహక జిల్లాల అధికారులకు సూచనలు జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు.