Share News

ఎన్‌హెచ్‌-65 డీపీఆర్‌లపై భగభగలు!

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:26 AM

ఎన్‌హెచ్‌-65ను ఆరు వరసలుగా విస్తరించేందుకు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు రూపొందిస్తున్న డీపీఆర్‌లు వివాదాస్పదంగా మారాయి. విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను విస్మరించి.. ఒక్క ఓఆర్‌ఆర్‌ చుట్టూనే తిప్పడంపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ సాకారం కావడానికి కనీసం ఐదేళ్లయినా పడుతుందని, అప్పటి వరకు బెజవాడ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న డీపీఆర్‌లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎన్‌హెచ్‌-65 డీపీఆర్‌లపై భగభగలు!

- ఎన్‌హెచ్‌ అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల అసంతృప్తి

- విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ను విస్మరించడంపై ఆగ్రహం

- ఓఆర్‌ఆర్‌ చుట్టూ తిప్పుతుండటమే అసలు సమస్య

- ఇది సాకారం కావాలంటే ఐదేళ్లకు పైగానే సమయం

- అప్పటి వరకు విజయవాడ నగర పరిస్థితి ఏమిటని ప్రశ్న

ఎన్‌హెచ్‌-65ను ఆరు వరసలుగా విస్తరించేందుకు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు రూపొందిస్తున్న డీపీఆర్‌లు వివాదాస్పదంగా మారాయి. విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను విస్మరించి.. ఒక్క ఓఆర్‌ఆర్‌ చుట్టూనే తిప్పడంపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ సాకారం కావడానికి కనీసం ఐదేళ్లయినా పడుతుందని, అప్పటి వరకు బెజవాడ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న డీపీఆర్‌లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

బెజవాడ మీదుగా ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలను అనుసంధానించే అరవై ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ -65) ఆరు వరసల విస్తరణకు రూపకల్పన చేస్తున్న డీపీఆర్‌లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు రూపొందిస్తున్న డీపీఆర్‌లు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల ఆగ్రహానికి, అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఎన్‌హెచ్‌- 65 విషయంలోనే ఈ వివాదాలు ఎదురుకావటం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రెండు డీపీఆర్‌లు కూడా విజయవాడ నగరంలోని అంతర్గత ట్రాఫిక్‌ పరిస్థితులను గమనంలోకి తీసుకోకుండా.. పూర్తిగా నగరాన్ని విస్మరిస్తూ రూపొందించటమే వివాదాలకు కారణమవుతోంది. జాతీయ రహదారుల సంస్థ అధికారులు అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను అనుసంధానించటమే లక్ష్యంగా డీపీఆర్‌లు రూపొందిస్తున్నారు తప్పితే విజయవాడ సంగతిని వదిలేస్తున్నారు. హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు మాత్రమే ముందుగా ఎన్‌హెచ్‌ అధికారులు డీపీఆర్‌ను రూపొందించారు. మన ప్రజాప్రతినిధులు చివర్లో ఈ విషయం గురించి తెలుసుకుని ఎన్‌హెచ్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే కానీ అసలు విషయాలు బయట పడలేదు. అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు కనెక్టివిటీ తప్పితే విజయవాడ వరకు విస్తరించే అంశాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఆ రోజున నిర్వహించిన సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. గొల్లపూడిలోని విజయవాడ వెస్ట్‌బైపాస్‌ వరకు తీసుకురావాల్సిందేనని పట్టుబట్టారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అమరావతి వచ్చిన సందర్భంలో ఆయన్ను మెప్పించి ప్రస్తుత కనకదుర్గ ఫ్లై ఓవర్‌ వరకు దీనిని తీసుకు వచ్చేలా ప్రయత్నించారు. తుది డీపీఆర్‌లో ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిందే.

కానూరు నుంచి దావులూరు వరకు యథాతధంగా..

ఇదే ఎన్‌హెచ్‌పై బెంజిసర్కిల్‌ నుంచి మచిలీపట్నం వరకు ఆరు వరసలుగా విస్తరించే క్రమంలో రూపొందించిన డీపీఆర్‌ విషయంలో కూడా సమస్య ఎదురైంది. బందరు నుంచి అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ వెళ్లే దావులూరు వరకు మాత్రమే ఆరు వరసల రోడ్డు విస్తరణ చేపడతామని ప్రతిపాదించారు. బెంజిసర్కిల్‌ నుంచి కానూరు వరకు యథాతధంగానే ఉంటుందని, కానూరు నుంచి దావులూరు వరకు నాలుగు వరసలుగానే ఉంచుతూ అదనంగా సర్వీసు రోడ్లను అభివృద్ధి చేస్తామని, దావులూరు నుంచి బందరు వరకు 6 వరసలుగా విస్తరించేలా డీపీఆర్‌లో పొందుపరిచారు. దీంతో ఈ డీపీఆర్‌ పైనా ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు. ఎన్‌హెచ్‌ - 65 డీపీఆర్‌లను జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఎంత వరకు విజయవాడ నగరాన్ని విస్మరిస్తూ అవుటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ తిప్పుతున్నారు.

విజయవాడ నగరాన్ని విస్మరిస్తూ..

విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కానీ, రెండు జిల్లాల ప్రజలు కానీ విజయవాడ వరకు విస్తరించాలని పట్టుబట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. విజయవాడ నగరం మధ్యగా జాతీయ రహదారులు వెళ్లటం వల్ల దూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించటంతో పాటు నగరంలో అంతర్గత ట్రాఫిక్‌ భారీగా పెరిగిపోయింది. దీంతో ట్రాఫిక్‌ సమస్యల నుంచి పరిష్కారం కావాలన్నా.. విజయవాడ నగరం నుంచి భవిష్యత్తులో చేపట్టబోయే అవుటర్‌ రింగ్‌ రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా బయటకు వెళ్లటానికి తేలిగ్గా ఉంటుంది. నగంరలో కూడా అంతర్గత ట్రాఫిక్‌ సమస్యలకు కూడా చెక్‌ పెట్టవచ్చన్న ఆలోచనగా ఉంది. విజయవాడ - మచిలీపట్నం రూట్‌లో మెట్రో కారిడార్‌ వెళుతుంది. మెట్రో కారిడార్‌ కూడా ఉంది కాబట్టి డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించాలని మన ప్రజా ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు అనుసంధాన రోడ్లను కూడా విస్తరించటానికి వీలుగా ఇదే డీపీఆర్‌లోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ ఆలోచనలు మాత్రం ఖర్చు తగ్గించేవిగా ఉంటున్నాయి. దీంతో ఓఆర్‌ఆర్‌ చుట్టూ తిప్పుతున్నాయి. ఓఆర్‌ఆర్‌ అనేది ఇప్పటికిప్పుడు పనులు చేపట్టే పరిస్థితి లేదు. కనీసం పనులు ప్రారంభం కావటానికి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. నిర్మాణం కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. ఈ ఐదేళ్ల కాలంలో విజయవాడ ట్రాఫిక్‌ను తలచుకుంటేనే భయమేస్తోంది. ఓఆర్‌ఆర్‌ పేరు చెబుతున్న ఎన్‌హెచ్‌ అధికారులు విజయవాడను ట్రాఫిక్‌ సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు. దీంతో ఎన్‌హెచ్‌ - 65 డీపీఆర్‌లు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి.

Updated Date - Nov 07 , 2025 | 01:26 AM