కూలి కోసం సమ్మెకు సై
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:58 PM
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటిలో పనిచేస్తున్న హమాలీలకు కూలిరేట్లు పెంపు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.
ఆందోళనలకు సిద్ధమవుతున్న హమాలీలు
ఎమ్మిగనూరు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటిలో పనిచేస్తున్న హమాలీలకు కూలిరేట్లు పెంపు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి మార్కెట్‌లో పర్యటించిన క్రమంలో హమాలీల కూలి పెంపు పంచాయతీ కొలిక్కి వస్తుందనుకున్నప్పటికి అది కాస్తా మరోసారి వాయిదా పడింది. దీంతో హమాలీలు సమ్మెకు సిద్ధమవుతున్నారు. మార్కెట్ కమిటిలో పనిచేసే హమాలీలు, కూలీలు తమకు కనీస కూలి ఇవ్వాలని తరచూ డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా గతంలో కూలిరేట్లపెంపుపై చేసుకున్న అగ్రిమెంట్ 10.10.2024న ముగిసింది. దీంతో ఇరువురు సమావేశమై అగ్రిమెంట్ ప్రకారం 25శాతం కూలి పెంపుపై చర్చించి అగ్రిమెంటు చేసుకోవాల్సి ఉంది. అయితే గతంలో పలు మార్లు కమీషన ఏజెంట్లు, హమాలీల నడుమ కూలి పెంపుపై చర్చలు విఫలం కావటంతో వాయిదా పడుతూ వచ్చింది. ఈనెల 13న శనివారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో ఇరువురు సమావేశం నిర్వహించారు. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం మార్కెట్‌లో పనిచేస్తున్న వారితో పాటు కొత్త వారు పనిచేస్తున్నారని వారికి పూర్తిస్థాయిలో కొత్తగా లైసన్సులు ఇవ్యటం, ఏఏ దుకాణదారుడికి ఎంతమంది హమాలీలు అవసరమో ఆ మేరకు కొత్తవారిని తీసుకుని అటు తరువాత కూలి రేట్లపైంపుపై చర్చిద్దామని ఎమ్మెల్యే తెలిపారు. మార్కెట్‌లో ఎవరంటే వారు వచ్చి అనధికారికంగా పనులు చేస్తున్నారని, దీంతో వారికి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అన్నారు. అంతేగాక అనధికారింగా పనిచేసే వారు అక్రమాలకు పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని సమావేశంలో ప్రశ్నించారు. ఇందుకు హమాలీలు ససేమీరా అన్నారు. మార్కెట్ నడిచేది అంతంత మాత్రమేనని, ఏడాది పొడువునా మార్కెట్‌కు సరుకురాదని అలాంటప్పుడు కొత్తవారిని తీసుకుంటే ఏమి ప్రయోజనమన్నారు. ఈ విషయంపై చర్చించి చెబితే, కూలి పెంపు ఎంతమేర అన్నది చర్చిద్దామన్నారు. దీంతో సమావేశం అక్టోబరు 6వ తేదీకి వాయిదా వేశారు. కూలి పెంపు వాయిదా పడటంతో హమాలీలు తీవ్ర అసహనానికి లోనయ్యారు.
ఫ ప్రత్యేకశ్రేణి కార్యదర్శికి నోటీసు: మార్కెట్‌లో పనిచేస్తున్న హమాలీలు కూలీరేట్లు పెంచాలని కోరుతూ ఈనెల 15న హమాలీల సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కార్యదర్శికి నోటీసు ఇచ్చారు. ఏడురోజుల్లోగా కూలిరేట్ల సమస్యను పరిష్కరించకుంటే సెప్టెంబరు 22వ తేదీ నుంచి విధులకు పనులకు వచ్చేది లేదని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. కూలి పెంపుకోసం దాదాపు 11 నెలల నుంచి ఎదురు చూస్తున్నామని, రైతులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాయిదావేస్తున్న సర్దుకుపోతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా తమ సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూలీలు అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.