Share News

అప్పులు చేసి విలాసాలు!

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:36 AM

మైలవరంలో ఇద్దరు బిడ్డలను చంపిన వేములవాడ రవిశంకర్‌లో కర్కశకుడే కాదు.. విలాస పురుషుడు దాగి ఉన్నాడు. అతడు చేసిన అప్పులకు ఈ విలాసాలే కారణమని స్థానికులు చెబుతున్నారు.

అప్పులు చేసి విలాసాలు!

ఇద్దరు బిడ్డలను చంపిన రవిశంకర్‌లో మరో కోణం

తల్లిదండ్రులకు తెలియకుండా స్థలం విక్రయం

డబ్బులతో పరారీ.. లోగడ పోలీసు కేసు

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు

ప్రస్తుతం పరారీలో రవిశంకర్‌ తల్లిదండ్రులు

విజయవాడ/మైలవరం రూరల్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): మైలవరంలో ఇద్దరు బిడ్డలను చంపిన వేములవాడ రవిశంకర్‌లో కర్కశకుడే కాదు.. విలాస పురుషుడు దాగి ఉన్నాడు. అతడు చేసిన అప్పులకు ఈ విలాసాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి, పెళ్లి చేసుకుని పిల్లలను కన్న తర్వాత తిరిగి వచ్చాడని అతడి తల్లి అనిత హత్య ఘటన వెలుగులోకి వచ్చిన సందర్భంలో చెప్పింది. ఇలా ఇంట్లో నుంచి పారిపోవడానికి తల్లిదండ్రులతో జరిగిన గొడవ కారణం కాదని తెలుస్తోంది. మైలవరంలో దేవుడి చెరువు వద్ద రవిశంకర్‌ తల్లిదండ్రులకు కొంత స్థలం ఉంది. దీన్ని వారికి తెలియకుండా విక్రయించి ఆ డబ్బులతో జల్సాలు చేశాడు. మిగిలిన డబ్బులను తీసుకుని పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైలవరంలో చాలా మంది నుంచి అప్పులు తీసుకుని రవిశంకర్‌ ఐపీ పెట్టినట్టు తెలిసింది. నాడు రవిశంకర్‌ మైలవరంలో వెలగబెట్టన బాగోతాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

హత్యలపై చంద్రికకు సమాచారం ఇచ్చిన హోటల్‌ యజమాని

ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్‌కు హోటల్‌ యజమాని పవన్‌ ఫోన్‌ చేశాడు. తొమ్మిదో తేదీన పనికి వస్తాడో రాడో తెలుసుకున్నాడు. ఆ సమయంలో పిల్లలు ఇద్దరికి పురుగుల మందు ఇచ్చి చంపేశానని, తానూ ఏదో ఒకటి చేసుకుంటానని చెప్పి ఫోన్‌ కట్‌ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. ఇదంతా రవిశంకర్‌ ఇబ్రహీంపట్నంలో ఉండగా జరిగిన సంభాషణ. రవిశంకర్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ కావడంతో పవన్‌ వెంటనే తన సోదరికి ఫోన్‌ చేసి బహ్రెయిన్‌లో ఉంటున్న చంద్రిక ఫోన్‌ నంబరు తీసుకున్నాడు. రవిశంకర్‌ భార్య చంద్రిక, పవన్‌ సోదరికి పరిచయం ఉండడంతో ఆమె నంబరును తీసుకుంది. రవిశంకర్‌కు ఫోన్‌ చేస్తే చెప్పిన విషయాలను చంద్రికకు పవన్‌ వివరించాడు. ఆ తర్వాత హోటల్‌లో పనిచేసే మరో ఇద్దరు వర్కర్లను రవిశంకర్‌ ఇంటికి పంపాడు. తాళాలు వేసి ఉండడంతో వారు బయట నుంచి చూసి వెనుదిరిగారు. ఈ విషయాలన్నీ చంద్రికకు పవన్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. అప్పటి నుంచి చంద్రిక పవన్‌కు, ఆయన సోదరికి రోజూ ఫోన్‌ చేసి రవిశంకర్‌ గురించి, పిల్లల గురించి ఆరా తీసేది. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లేదని వారు చంద్రికకు చెప్పేవారు. ఇదిలా ఉండగా, కొద్దిరోజుల క్రితం వరకు మైలవరంలో ఉన్న రవిశంకర్‌ తల్లిదండ్రులు లక్ష్మీపతి, అనిత పరారయ్యారు. అత్తాకోడళ్ల మధ్య వివాదాలు ఉన్నాయన్న విషయం బయటకు రావడంతో పోలీసులు తమను పిలిచి విచారిస్తారన్న అనుమానంతో వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Updated Date - Jun 23 , 2025 | 12:36 AM