ఆస్పత్రికి వెళుతుండగా మార్గమధ్యంలో ప్రసవం
ABN , Publish Date - May 30 , 2025 | 12:53 AM
పురుటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని కాలినడకన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించిన సంఘటన మండలంలోని కోసంగిలో గురువారం చోటుచేసుకుంది.
చాపరాయి గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అంబులెన్స్ రాలేని పరిస్థితి
నడిచి వెళుతుండగా డెలివరీ
తల్లీబిడ్డ క్షేమం
డుంబ్రిగుడ, మే 29(ఆంధ్రజ్యోతి): పురుటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని కాలినడకన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించిన సంఘటన మండలంలోని కోసంగిలో గురువారం చోటుచేసుకుంది. పోతంగి పంచాయతీ కోసంగి గ్రామానికి చెందిన వంతాల లక్ష్మికి గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చాయిరాయి గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో అంబులెన్స్ అక్కడికి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో గెడ్డ దాటించి అంబులెన్స్ వద్దకు తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. ఆమెను కాలినడకన తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో ప్రసవించింది. ఆమెకు కుటుంబ సభ్యులు సపర్యలు చేసి పనసపుట్టు గ్రామానికి తీసుకురాగా, అక్కడ నుంచి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.