వైభవంగా గీతా జయంతి
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:07 AM
పట్టణంలోని పలు ఆలయాలలో సోమవారం గీతాజయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు.
నంద్యాల కల్చరల్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు ఆలయాలలో సోమవారం గీతాజయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. చిత్తలూరివారి వీధిలో వెలసిన శ్రీకృష్ణమందిరంలో మహిళలు శ్రీకృష్ణుని విగ్రహానికి అభిషేక పూజలు నిర్వహించి, భగవద్గీతకు పూజలు చేశారు. మహిళలు గీతా పారాయణం చేపట్టారు. బొమ్మలసత్రంలోని సాయిబాబా గుడిలోని శ్రీకృష్ణ విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, భగవద్గీతలోని 18 అధ్యాయాలను పారాయణం చేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, గాయత్రీదేవికి కుంకుమార్చన చేశారు. ఉమామహేశ్వరస్వామి ఆశ్రమంలో శివానంద గిరి స్వామిజీ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పాములపాడు: మండలంలోని మిట్టకందాల గ్రామంలో గీతా జయంతిని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాగసాయి విద్య బ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి రామనందస్వామి ప్రవచనాలు వినిపించారు. హిందువులకు పవిత్రమైన గీతా జయంతి రోజున శ్రీ కృష్ణ పరమాత్మను ప్రత్యేకంగా ఆరాధించాలని, భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు చేకురుతాయన్నారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు.