Rajamahendravaram: ఇల్లు వదిలి వెళ్లి.. ఇన్‌స్టా రీల్ చూసి తిరిగొచ్చి..
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:03 AM
ఆ ముగ్గురు అమ్మాయిలదీ ఒకే ఊరు. చిన్ననాటి నుంచి కలిసిమెలసి పెరిగారు. కలిసే చదువుకున్నారు.
హైదరాబాద్ వెళ్లిన బాలికలు క్షేమంగా ఇంటికి
రాజమహేంద్రవరం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఆ ముగ్గురు అమ్మాయిలదీ ఒకే ఊరు. చిన్ననాటి నుంచి కలిసిమెలసి పెరిగారు. కలిసే చదువుకున్నారు. అయితే పదో తరగతి తర్వాత వారి స్నేహానికి పెద్దలు అడ్డుచెప్పారు. కలవడానికి వీల్లేదంటూ షరతు విధించారు. దీంతో వారు తల్లిదండ్రులకూ దూరంగా ఎక్కడికైనా వెళ్లి కొన్నిరోజులు హాయిగా గడపాలనుకున్నారు. కొంత నగదు పోగేసి.. క్రిస్మస్ సందర్భంగా ముగ్గురూ కలిసి హైదరాబాద్ రైలెక్కారు. అయితే ట్రెయిన్‌లో బిడియంగా తిరుగుతున్న వారిని వీడియో తీసి ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి ఆ బాలికల కంటపడంతో తెల్లారేసరికి ఇంటికి తిరిగొచ్చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ముగ్గురు బాలికలు (16 ఏళ్లు) ఇళ్లు ఒకే ప్రాంతంలో ఉన్నాయి. పదో తరగతి తర్వాత వారిలో ఇద్దరు ఇంటర్‌లో చేరగా.. ఒక బాలిక చదువు ఆపేసింది. ఈ క్రమంలో ముగ్గురూ స్నేహంగా ఉండొద్దని ఇంట్లో అడ్డుచెప్పారు. అయితే క్రిస్మస్ సందర్భంగా కలుసుకున్న ఈ ముగ్గురూ బుధవారం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు వెళ్లి హైదరాబాద్ వెళ్లే రైలు ఎక్కేశారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి అదేరోజు రాత్రి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు మొదలుపెట్టాయి. అయితే వాళ్లు రైలులో ఉన్న సమయంలో ఓ యువకుడు వీడియో తీసి బాలికలు తప్పిపోయారంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అది చక్కర్లు కొట్టి చివరికి బాలికలకు చేరింది. ఆ వీడియో చూసి తమను పోలీసులు పట్టుకుంటారని భావించారు. హైదరాబాద్‌లో షాపింగ్ చేసుకొని బట్టలు కొనుక్కున్నారు. గురువారం రాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్ ఎక్కి శుక్రవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. పోలీసులు వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపించారు.