Share News

Justice Dheeraj Singh Thakur: బాలికలు భారం కాదు.. ఆస్తి

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:10 AM

బాలికలు భారమనే ఆలోచన నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ అన్నారు..

Justice Dheeraj Singh Thakur: బాలికలు భారం కాదు.. ఆస్తి

  • పిల్లల మధ్య లింగభేదాలు చూపించొద్దు

  • టీనేజర్లకు పోక్సో, ఇతర చట్టాలపై అవగాహన కల్పించాలి: హైకోర్టు సీజే

అమరావతి/విజయవాడ, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): బాలికలు భారమనే ఆలోచన నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. ఆడపిల్లలు భారం కాదని, వారు మన ఆస్తి అని పేర్కొన్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే విషయంలో మగపిల్లల కంటే ఆడపిల్లలే మరింత మెరుగ్గా ఉన్నారని తెలిపారు. పిల్లల మధ్య తల్లిదండ్రులు ఎలాంటి లింగభేదాన్ని చూపించకుండా సమానత్వం చూపించాలని, ఆడ, మగ సమానమనే భావన ఉండాలని అన్నారు. బాలికల సంరక్షణకు సంబంధించిన చట్టాలపై టీనేజ్‌ యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. పోక్సో, ఇతర చట్టాలపై అవగాహన లేక యుక్త వయసులో చేసిన తప్పులకు వారు భవిష్యత్‌ కోల్పోతున్నారని చెప్పారు. విజయవాడ తమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా బాలికల సంరక్షణ అంశంపై రాష్ట్రంలోని వివిధ రంగాల భాగస్వాములతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జువైనల్‌ జస్టిస్‌ కమిటీ(జేజేసీ) ఆదివారం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. జస్టిస్‌ ఠాకూర్‌ ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన, ప్రత్యేక అతిథిగా హాజరైన జస్టిస్‌ రేవతి మోహితి దరే, జేజేసీ చైర్మన్‌ జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, సభ్యులు జస్టిస్‌ వి.సుజాత, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ కిరణ్మయి మండవ, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అంతకుముందు బెథనీ చిల్డ్రన్‌ హోమ్‌ బాలికలు సీజే, జస్టిస్‌ రేవతి మోహితి దరే, జేజేసీ ఛైర్మన్‌, సభ్యులకు మొక్కలు బహూకరించారు. ఈ సందర్భంగా సీజే మాట్లాడారు. ‘రాష్ట్రంలో బాలికలు, బాలుర అక్షరాస్యత విషయంలో వ్యత్యాసం కొనసాగుతోంది. గణాంకాలు పరిశీలిస్తే బాలుర అక్షరాస్యత 73 శాతం ఉంటే, బాలికలది 59 శాతంగానే ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలతో జూనియర్‌ సివిల్‌ జడ్జి నియామకాల్లో ఇటీవల మహిళా న్యాయాధికారుల సంఖ్య పెరిగింది. ఆడబిడ్డ భారం కాదు.. ఆస్తి అని తల్లిదండ్రులు గుర్తించిన కారణంగానే ఈ మార్పు సాధ్యమైంది. క్రైం బ్యూరో రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. కుటుంబ సభ్యులకు బాగా సన్నిహితంగా మెలిగేవారే బాలికలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని స్పష్టమవుతోంది. బయటివారి నుంచే కాకుండా వక్ర బుద్ధితో ఉన్న సన్నిహితుల నుంచీ వారిని కాపాడుకోవలసిన అవసరం ఉంది’ అని తెలిపారు. చిన్నారుల రక్షణ విషయంలో ఉన్న టోల్‌ ఫ్రీ నంబర్‌ 1098 పనితీరును ఆయన ప్రశంసించారు. సదస్సులో పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, అధికారులు పాల్గొన్నారు.


1.jpg

బాలురతో సమానంగా అవకాశాలు: జస్టిస్‌ రేవతి

జస్టిస్‌ రేవతి మాట్లాడుతూ.. బాలురతో సమానంగా బాలికలకూ సమాన అవకాశాలు కల్పించాలని, వారికి సురక్షిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టంచేశారు. పోక్సో, బాల్యవివాహ నిషేధ చట్టం, ఇతర చట్టాల అమలు విషయంలో పోలీసు అధికారులు, న్యాయాధికారులు మరింత సున్నితత్వంతో వ్యవహరించినప్పుడే బాలికలు ధైర్యంగా ముందుకొచ్చి వారికి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. బాలికల కలలను ఆదిలోనే తుంచివేయకుండా.. అవి సాకారమయ్యేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జేజేసీ చైర్మన్‌ జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ తెలిపారు. ‘అమ్మాయిలను రక్షించడం దాతృత్వం కాదు. దేశ పురోగతికి అది పెట్టుబడి’ అని వివరించారు. బాలిక అంటే ఓ కుమార్తె కాదని, సమర్థ నాయకురాలు, శిక్షకురాలు, సృష్టికర్త, వినూత్న వ్యక్తి అని జస్టిస్‌ వి.సుజాత తెలిపారు.

Updated Date - Sep 15 , 2025 | 04:10 AM